iDreamPost
iDreamPost
వచ్చే ఏడాదితో నారా లోకేష్ కి ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. ఆయన త్వరలోనే మండలిలో కూడా అవకాశం కోల్పోతున్నారు. మాజీ కాబోతున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో విజయం చవిచూసిన దాఖలాలు లేకపోవడంతో ఆయన భవిష్యత్తుపై చంద్రబాబు కూడా బెంగపెట్టుకున్నారు. టీడీపీ శ్రేణుల్లో విశ్వాసం పెంచలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి మంగళగిరి నుంచి బరిలో ఉంటానంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి స్పష్టత ఇచ్చేశారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న లోకేష్ 2024లో మాత్రం గెలిచి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంతేగాకుండా మంగళగిరి విజయాన్ని కానుకగా ఇస్తామని చంద్రబాబుకి ఆయన హామీ కూడా ఇచ్చారు.
చంద్రబాబు దీక్ష ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్ ఆశ్చర్యకరంగా స్పందించారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకి గడ్డు పరిస్థితి రావడంతో ఆయన సీటు మారుతారా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో మంగళగిరిలో ఆర్కేని ఎదుర్కోవడం కష్టంగా ఉన్న లోకేష్ కూడా పునరాలోచనలో ఉన్నారనే ప్రచారం ఉంది. వాటికి తెరదించుతూ తాను మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తాననే సంకేతాలు ఇచ్చేశారు.
తెలుగుదేశం పార్టీకి 1980 నుంచి మంగళగిరిలో విజయం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషంగా చెప్పవచ్చు. 1983, 85 ఎన్నికల్లో వరుసగా టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత 1994లో టీడీపీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి మంగళగిరిలో గెలిచారు. ఇక టీడీపీ పోటీ చేసిందే రాష్ట్ర విభజన తర్వాత. ఈ రెండు ఎన్నికల్లో వరుసగా గంజి చిరంజీవిపై 2014లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో నారా లోకేష్ ని చిత్తు చేశారు. అయినప్పటికీ తమకు అక్కడ గెలిచిన దాఖలాలే లేవన్నట్టుగా లోకేష్ చెప్పుకోవడం విస్మయకరంగా ఉంది.
అమరావతి ని చూసుకుని మంగళగిరి ని ఎంచుకున్న నారా లోకేష్ కి అక్కడి టీడీపీ చరిత్ర ముందే తెలిసి ఉంటుందనడంలో సందేహం లేదు. అయినా మంగళగిరిని ఎంచుకున్నప్పటికీ జనం మాత్రం ఆయన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక గడిచిన రెండున్నరేళ్లలో మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలు కార్పోరేషన్ స్థాయికి ఎదిగాయి. ఏపీ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. మంగళగిరిలో పలు ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. ముఖ్యంగా గుంటూరులో ఉన్న ఆరోగ్య శ్రీ ఆఫీసు, గొల్లపూడిలో ఉన్న పలు కార్యాలయాలను మంగళగిరికి తరలించారు. దాంతో మంగళగిరి చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పాలనా వికేంద్రీకరణ చట్టంలో కూడా ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించింది. మంగళగిరి ని ఆనుకుని అభివృద్ధికి కేంద్రీకరిస్తామని చెప్పింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇది మంగళగిరి వాసులకు తెలిసిన విషయమే. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు వంటి నేతలు టీడీపీ ని వీడిపోయారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్ కి కష్టకాలం అనివార్యమయ్యేలా ఉంది. దానికి తోడు బీసీలలో ప్రధానంగా చేనేత వర్గాలకు తగిన గుర్తింపు లేకపోవడంతో కాండ్రు కమల వంటి వారు కూడా టీడీపీకి దూరమయిన నేపథ్యంలో లోకేష్ కి రాబోయే కాలం పెద్ద పరీక్షగానే చెప్పాలి. పోటీకి సిద్ధమేనని చెప్పిన తరుణంలో తన భవిష్యత్తు, టీడీపీ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి అనుభవం ఎదుర్కొంటారన్నది ఆసక్తికరమే.
Also Read : No Friends For CBN -ప్రజలు పట్టించుకోలేదు సరే ….. మిత్రులూ ముఖం చాటేశారా ?