iDreamPost
iDreamPost
కొత్త పెళ్ళికొడుకు భార్యను జల్లెడ అడ్డుపెట్టి ఊకతో కొట్టాడన్నట్టు ఉంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధోరణి. సాధారణంగా సందర్భానికి సింక్ కాకుండా, తను మాట్లాడే పదాలకు అర్థం తెలియకుండా మాట్లాడడం లోకేశ్ వ్యవహారశైలి. అందుకే ఆయన ఏం మాట్లాడీనా సహజంగానే తప్పులు దొర్లుతుంటాయి. వాటిని పట్టుకొని వైఎస్సార్ సీపీ నేతలు ఒక ఆటాడుకుంటారు. అసలు లోకేశ్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోవడానికి ఆయన భాషా పాండిత్యం కూడా ఒక కారణం అని విశ్లేషకులు చెబుతుంటారు. మందలగిరి అంటూ తాను పోటీ చేసిన నియోజకవర్గం పేరునే ఆయన సరిగా ఉచ్చరించలేకపోవడం జనంలో నవ్వులపాలయ్యేలా, ఓటర్లకు దూరం చేసేలా పరిణమించింది అంటారు.
లోకేశ్ బయటకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే టీడీపీకి మైలేజీ కన్నా డ్యామేజీ ఎక్కువ జరుగుతోందని ఒకటికి పదిసార్లు రుజువైంది. అందుకే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. అయితే అటువంటి వాటిలో కూడా తప్పులు, ఆతిశయోక్తులు దొర్లుతుంటాయి. తాజాగా ఆయన శనివారం స్పందిస్తూ విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది పూర్తయింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కంటూ నినదిస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనాలు అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ టీడీపీ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉందని ఒక బండ అబద్దాన్ని అలవోకగా ట్వీటేశారు. పనిలో పనిగా విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం బాధాకరమని విమర్శలు గుప్పించారు.
నిరసన గళాన్ని ఎవరికి వినిపించారట?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ టీడీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంది అని లోకేశ్ పేర్కొనడం ఉక్కు కార్మికులే ఆశ్చర్యపోయేలా ఉంది. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినది మొదలు ఇప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనని టీడీపీ నాయకులు విశాఖ ఉక్కుపై నిరసన గళం వినిపించారు అంటే ఎవరు నమ్ముతారు? పెట్రో ధరలు పెరిగినా, పోలవరం నిధులు విడుదల కాకపోయినా, ప్రత్యేక హోదాను అటకెక్కించినా, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామని కరాఖండీగా కేంద్రం ప్రకటించినా ఏనాడూ టీడీపీ నోరు మెదపలేదు.
బీజేపీని విమర్శించడానికి ధైర్యం చాలని టీడీపీ ఈ విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేసింది. ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని లోకేశ్ పేర్కొని బీజేపీని నేరుగా విమర్శించలేని టీడీపీ అసహాయతను మరోసారి బయటపెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేశారు అంటున్న లోకేశ్ కు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశంపై వైఎస్సార్ సీపీ సభ్యులు ప్రశ్నించిన విషయం, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలియదా? ఇంత పబ్లిక్ గా అవాస్తవాలను వల్లిస్తూ ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనా వేయడం లోకేశ్కే చెల్లిందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.
Also Read : అప్పుల్లో తెలుగుదేశం పార్టీ ? !