iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ రివ్యూ 4 – ముందే చూపించిన ‘వైరస్’

  • Published Apr 15, 2020 | 9:40 AM Updated Updated Apr 15, 2020 | 9:40 AM
లాక్ డౌన్ రివ్యూ 4 – ముందే చూపించిన  ‘వైరస్’

కరోనా విలయతాండవం కొనసాగుతున్న వేళ దేశం మొత్తం భయం గుప్పిట్లో ఇంట్లోనే కాలాన్ని గడుపుతోంది. కాలు బయట పెడితే ప్రమాదమని ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తూ ఉండటంతో ఇది ఎప్పటికి పూర్తిగా సద్దుమణుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టైం పాస్ కోసం జనం టీవీతో పాటు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధాపడుతున్నారు. బోలెడు సినిమాలు అందుబాటులో ఉండటంతో ఇతర బాషల మీద కూడా ఓ లుక్ వేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు కోవిడ్ గురించిన వార్తలు విశేషాల మీదే పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత ఏడాది మలయాళంలో వచ్చిన వైరస్ మీద ఓ లుక్ వేద్దాం

కథ

2018లో కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ కుదిపేసింది. మనిషి నుంచి మనిషికి ఈజీగా అంటుకునే ఈ వ్యాధి వల్ల మృత్యువు పాలైన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ సరైన సమయంలో చర్యలు తీసుకుని కట్టడి చేసింది. దీని ఆధారంగానే కథను రాసుకున్నారు. కోజికోడ్, మలప్పురం జిల్లాలో అంతుచిక్కని రీతిలో చావులు మొదలవుతాయి. ఏదో వ్యాధి ప్రబలడంతో తొలుత అధికారులకు సైతం ఏమి అర్థం కాదు. దాని మూలాలు కనుగొన్నాక నిపా వైరస్ అని పేరు పెట్టి దాన్ని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగుస్తుంది. మరి దాని మీద ఎలా విజయం సాధించారు అనేదే వైరస్ స్టోరీ.

సహజత్వమే నటన

ఇది మలయాళం సినిమా కాబట్టి దాదాపు అందరూ ఏ మాత్రం పరిచయం లేని మొహాలే కనిపిస్తాయి. అయితే ఎవరూ కూడా నటించాం అనే తరహాలో కాకుండా చాలా సహజంగా పాత్రల్లో లీనం కావడంతో మనమూ ఆసుపత్రుల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందుతాం. అసిఫ్ అలీ, రీమా కళింగల్, శ్రీనాథ్ బాసి, పార్వతి, కుంచకో బోబన్, ఇంద్రజిత్ సుకుమారన్, పూర్ణిమ ఇలా ఎవరికి వారు తమలోని బెస్ట్ ఇచ్చేశారు. అయితే సీనియర్ హీరోయిన్ కం నటి రేవతి గారు ఓ కీలక పాత్ర చేయడం విశేషం. హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఆ రోల్ కి నిండుతనం తెచ్చారు. డాక్టర్ సలీమ్ గా నటించిన రెహమాన్ అలియాస్ రఘు మనకు సుపరిచితుడే.

టీమ్ ప్రతిభ

వైరస్ తాలూకు పరిణామాలు, దాని వల్ల జనంలో రేగే భయాందోళనలను దర్శకుడు ఆషిక్ అబూ చక్కగా చూపించాడు. రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ కే కట్టుబడి రెండున్నర గంటల పాటు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నిపా వచ్చిన కుటుంబాలలోని వ్యథలను, వాళ్ళ భావోద్వేగాలను సున్నితమైన రీతిలో ఆవిష్కరించిన తీరు పిండేస్తుంది.

నిన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కరోనా వల్ల చనిపోతే ఆ మృతదేహం దహనసంస్కారానికి కూడా ఎంత యాతన పడాల్సి వచ్చిందో ఇలాంటి సంఘటనలు వైరస్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు చూపే తెగువ బాగా ఎక్స్ ప్లోర్ చేశారు దర్శకుడు. డ్రై సబ్జెక్టు కావడంతో ఇందులో ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఆశించకూడదు. సెన్సిటివ్ గా ఉండేవాళ్లు వైరస్ కి దూరంగా ఉంటేనే మంచిది. ల్యాగ్ ఉన్నప్పటికీ దర్శకుడి సిన్సియారిటీ చివరిదాకా చూసేలా చేస్తుంది. రాజీవ్ రవి ఛాయాగ్రహణం, సుషిన్ శ్యామ్ సంగీతం వైరస్ కు చాలా హెల్ప్ అయ్యాయి.

చివరి మాట

మనిషి టెక్నాలజీ పరంగా ఎంత ఉన్నత స్థాయికి వెళ్లి కోట్లాది సంపదను సృష్టించినా ప్రకృతి ముందు తానెంత అల్పజీవో కరోనా ప్రపంచం మొత్తానికి పాఠం నేర్పింది. స్వైన్ ఫ్లూ, నిపా, కరోనా పేరేదైనా కావొచ్చు దాన్ని అదుపులోకి తెచ్చేలోపే కొన్ని వేల లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకే మానవాళి మనుగడ కేవలం సంపద సృష్టిలో లేదు.

గాడి తప్పిన వ్యవస్థ తీరుని సరిదిద్దడంలో ఉంది. క్రమశిక్షణ లోపించిన జనం మనస్తత్వంలో ఉంది. అది కాస్త ఘాటుగా అర్థమయ్యేలా చెప్పడంలో వైరస్ లాంటి వెండితెర ప్రయత్నాలు మంచి విజయాన్నే సాధించాయి. ఇంగ్లీష్ మూవీ కంటాజియన్ ను స్ఫూర్తిగా తీసుకున్నప్పటికి వైరస్ లో ఒక విలక్షణమైన శైలి ఉంది. గాయపడిన కేరళ హృదయం ఉంది. ఓసారి చూసేందుకు ప్రయత్నించండి. ప్రైమ్ లో తెలుగు సబ్ టైటిల్స్ తో ఉంది.