Idream media
Idream media
నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అక్కడ అధికార పార్టీ నుంచి పోటీలో ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపునకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ భారీ ఆధిక్యం సాధించి ఎంపీ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం నుంచి ఘన విజయం పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్థానికనేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలవడం మాత్రమే కాకుండా అంతకు మించిన లక్ష్యం టీఆర్ఎస్ కు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రేపే ఎన్నిక
ఈ నెల 9న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. భారీ మెజార్టీతో కవిత కల్వకుంట్లను గెలిపించాలని లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు దూసుకు పోతుంది. ఇప్పటివరకూ నిజామాబాద్‌లో 8మంది బీజేపీ కార్పొరేటర్లు, ఒక జడ్పీటీసీ, మరో కాంగ్రెస్ కార్పొరేటర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. నిన్న ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చాట్ల రాజేశ్వర్, మరో ఇద్దరు 19 వ వార్డు కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్, 32 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పంపరి లత తదితరులు కారు ఎక్కారు. పోలింగ్‌కు గడువు సమీపించడంతో ఆయా మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను శనివారమే క్యాంప్‌కు తరలించారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తుండడంతో ఆమెకు మద్దతుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌నకు పంపించారు.
ఇంకా పెరుగుతున్న బలం
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 70శాతానికి పైగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయిన్పటికీ బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీకి పట్టున్న నిజామాబాద్ నగరంలో ఆ పార్టీ కార్పొరేటర్లు సైతం కారెక్కుతున్నారు. ఫిరాయింపులతో 570 వరకు ఉన్న టీఆర్‌ఎస్ బలం.. వలసలతో 645 వరకు పెరిగింది.
తాజాగా సోమవారం నాడు 44వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బైకాన్ సుధ మధు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. తమ పార్టీ నేతలను కారెక్కకుండా ఆపడం స్థానిక ఎంపీ అర్వింద్‌కు సవాలుగా మారింది.