Idream media
Idream media
ఈ యేడాది అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం జూన్ 7 న డిజిటల్ ర్యాలీలతో బిజెపి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నది..రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్చువల్ ప్రచారంను ఆరంభించనున్న తరుణంలో పాలక ఎన్డీయే కూటమిలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి.ఎన్డీయే సంకీర్ణ భాగస్వామి ఎల్‌జెపి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పనితీరుపై విమర్శలు గుప్పించింది. వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని ఎల్‌జెపి యువనేత చిరాగ్ పాశ్వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
శుక్రవారం ఒక జాతీయ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ బీహార్ ప్రభుత్వం వలస కార్మికుల తరలింపును ఇంతకు ముందే ప్రారంభించి ఉంటే, జ్యోతి కుమార్ వంటి వారికి మేము ఆదర్శంగా ఉండే వారిమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల తరలింపులో జాప్యం నివారించి ఉంటే కాలినడకన ఇళ్లకు బయల్దేరిన కార్మికుల మరణాలను బహుశా అడ్డుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండేదని ఆయన సీఎం నితీశ్‌పై ధ్వజ మెత్తారు.అలాగే రెండు రోజుల క్రితం రాష్ట్రంలో వలస కార్మికుల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నెంబర్లు పని చేయడం లేదని,వలస కార్మికులకు కల్పిస్తున్న క్వారంటైన్ సౌకర్యాలను ప్రశ్నిస్తూ బీహార్ సీఎం నితీశ్‌కి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ లేఖాస్త్రాన్ని సంధించాడు.
ఇంకా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి అనేది అతిపెద్ద భాగస్వామి అయిన బిజెపి నిర్ణయించాలని ఎల్‌జెపి యువనేత పేర్కొన్నాడు. అలాగే ఎన్నికలలో నితీశ్ కుమార్‌తో పాటే బిజెపి ముందుకు వెళ్లాలనుకుంటే మేము వారితోనే ఉంటాము. ఒకవేళ బిజెపి మనసు మార్చుకొని రాష్ట్రంలో ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చాలని యే నిర్ణయం తీసుకున్న మేము మద్దతు ఇస్తాము అని ఆయన ప్రకటించారు. దీంతో పాలక ఎన్డీయే సంకీర్ణంలో చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
ఇక బీహార్‌లో తిరిగి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్ర అసెంబ్లీలోని 242 సీట్లలో 225 కి పైగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిరాగ్ వ్యాఖ్యలపై స్పందించిన స్థానిక బిజెపి నేతలు నితీశ్ నాయకత్వ సమర్థతపై తమకు ఎలాంటి అపోహలు లేవన్నారు.వలస కార్మికుల సంక్షోభాన్ని నివారించడంలో సీఎం నితీశ్ విఫలమైనట్లు తాము కూడా భావిస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు.
అయితే గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జనతాదళ్ (యునైటెడ్), బిజెపి కలిసి నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోరాడతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.పైగా కొన్ని రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నితీశ్ సారథ్యంలోనే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు.బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్ షా రేపటి తన డిజిటల్ ప్రచారంలో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.