iDreamPost
iDreamPost
‘‘రాముడి ప్రతి నిర్ణయానికి హనుమంతుడు తోడుగా నిలిచాడు. రాముడి అడుగులో అడుగు వేసి నడిచాడు. కానీ హనుమంతుడిని చంపుతుంటే.. రాముడు మౌనంగా ఉండటం సరికాదు’’ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలివి. ఇక్కడ హనుమంతుడు చిరాగ్ పాశ్వాన్ అయితే.. రాముడు ప్రధాని నరేంద్ర మోడీ అట. మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తాను ప్రధాని మోడీకి నమ్మినబంటునని, ఆయన రాముడైతే తాను హనుమంతుడినని చిరాగ్ అన్నారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీ నాయకత్వ సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాను ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోలేదని మోడీని విమర్శించారు చిరాగ్ పాశ్వాన్.
బీజేపీ అండతో జేడీయూపై విమర్శలు.. కానీ..
మొన్నటిదాకా ఎన్డీయే కూటమిలో చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు. కానీ గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీకి తక్కువ సీట్లు ఇవ్వడంతో జేడీయూతో చిరాగ్ తెగదెంపులు చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయేలో ఉంటామని, రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జేడీయూ పోటీ చేస్తున్న అన్ని సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దింపారు. దీని ప్రభావం గట్టిగా చూపింది. జేడీయూ సీట్లకు భారీగా గండిపడింది. మరోవైపు ఎల్జేపీ ఓట్లు బాగానే సంపాదించుకున్నా.. సీట్లు రాలేదు. ప్రచారం సమయంలో మోడీని చిరాగ్ ఒక్క మాట కూడా అనలేదు. పైగా బీజేపీని వెనకేసునివచ్చారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ పై విమర్శల దాడి చేశారు. జేడీయూ అభ్యర్థులపై పోటీకి దిగడం, నితీశ్ కుమార్ ను విమర్శంచడం అంతా.. బీజేపీ హైకమాండ్ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడూ ప్లేటు ఫిరాయించే నితీశ్ కు బుద్ధి చెప్పేందుకే ఇలా చేశారన్న వాదనలు ఉన్నాయి. ఇందుకు చిరాగ్ కు కొన్ని హామీలు ఇచ్చిందనే ఊహాగానాలు వినిపించాయి.
బాబాయి తిరుగుబాటు
ఎన్నికల తర్వాత జేడీయూ, బీజేపీ కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ రెంటికీ చెడ్డ రేవడిలా మారింది మాత్రం చిరాగ్ పాశ్వాన్. తర్వాత ఎల్జేపీ నాయకత్వ సంక్షోభంలో చిక్కుకుంది. చిరాగ్ సొంత చిన్నాన్నే ఆయనపై తిరుగుబాటు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ ను తప్పించారు. జేడీయూ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని చిరాగ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రాముడు, హనుమంతుడి కామెంట్స్ చేశారు చిరాగ్ పాశ్వాన్. నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా గతంలో ఎల్జేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. హనుమంతుడు ప్రతిసారి మద్దతుగా నిలిచాడని.. మరి ఎల్జేపీ సంక్షోభంలో ఉన్నప్పుడు బీజేపీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తుందని అశిస్తామని, కానీ బీజేపీ మౌనం తనకు విచారం కలిగిస్తోందని చిరాగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుడ్డిగా నమ్మి..
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయనే దానికి చిరాగ్ పాశ్వాన్ ఓ ఉదాహరణ. బీజేపీని గుడ్డిగా నమ్మి ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. జేడీయూని దెబ్బతీసినా.. తానూ దెబ్బతిన్నారు. ఇక్కడ లాభపడింది బీజేపీ. నష్టపోయింది ఎల్జేపీ. ఎన్నికల తర్వాత ఎల్జేపీని బీజేపీ కనీసం పట్టించుకోలేదు. ఎల్జేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయారు. కనీసం ఆయన స్థానంలో కూడా చిరాగ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వాళ్లనే పక్కన పెట్టిన మోడీకి.. చిరాగ్ పాశ్వాన్ ను పక్కన పెట్టడం పెద్ద విషయమా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీని నిలబెట్టిన అద్వానీకే దిక్కులేనప్పుడు.. పాశ్వాన్ ను పట్టించుకునేదెవరు? అని అంటున్నారు.
Also Read : నారా లోకేష్ మీద కుట్ర జరుగుతుందట …!