iDreamPost
iDreamPost
నిన్న రవితేజ అభిమానులతో పాటు అతని కోసమే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఉదయం నుంచి రాత్రి దాకా క్రాక్ షోలు వేయకుండా జరిగిన రాద్ధాంతం ఒక పీడకలలా ఎప్పటికీ మిగిలిపోతుంది. విసుగొచ్చి ఇంటికెళ్లిపోయిన వాళ్ళ సంగతేమో కానీ వేలాది జనం మాత్రం అప్పుడో ఇప్పుడో షోలు వేస్తారని గేట్ల దగ్గర పడిగాపులు కాచుకున్న దృశ్యాలు చాలా కనిపించాయి. సోషల్ మీడియాలోనూ ఈ ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. రాత్రి 9 తర్వాత కానీ ఆటలకు విముక్తి కలగకపోవడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యింది. నిర్మాత మధు ఆర్ధిక లావాదేవీలే దీనికి కారణమైనప్పటికీ ఇంత ఆలస్యం జరగడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సంతోషమే. కానీ రద్దైన వందలాది షోల రెవిన్యూ మొత్తం కోల్పోయినట్టే కదా. నిరాశగా వెనుదిరిగిన ప్రతి ఒక్కరు మళ్ళీ వస్తారన్న గ్యారెంటీ లేదు. అందులోనూ వందలు ఖర్చు పెట్టి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్స్ కూడా కొన్ని యాప్స్ వెంటనే ఇవ్వడం లేదు. వారం లేదా పది రోజులు ఆగండని మెసేజులు పంపిస్తున్నాయి. వీళ్లకు ఆ డబ్బులు వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఎలాగూ వస్తుంది కదా అని మళ్ళీ బుక్ చేసుకుంటే పర్లేదు. లేదంటే ఎగ్జిబిటర్లకు రావాల్సిన ఆ సొమ్ము చేజారినట్టే కదా. అసలే పైరసీ ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో ఇదంతా రిస్కీ వ్యవహారమే.
ఇప్పుడు దీన్నో పాఠంగా నిర్మాతలు నేర్చుకోవాలి. తెరవెనుక ఏం జరుగుతుందనేది సగటు ప్రేక్షకుడికి అవగాహన ఉండదు. సమయానికి షో పడిందా, టికెట్ డబ్బుకు న్యాయం జరిగిందా లేదా అనేదే తనకు ముఖ్యం. అంతే తప్ప కెడిఎంలు, లైసెన్సులు, డౌన్లోడ్లు, క్యూబ్లు, యుఎఫ్ఓలు ఇవన్నీ సంబంధం లేని వ్యవహారాలు. చూసుకోవాల్సింది ప్రొడ్యూసరే. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతారు. టాక్ ఒకవేళ డివైడ్ వచ్చి ఉంటే పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమే. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ప్రతిసారి ఇలాగే ఉంటుందన్న హామీ లేదుగా. అందుకే ఒక్కరోజు ముందైనా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకుంటే భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు ఇబ్బందులు రాకుండా తప్పించుకోవచ్చు.