iDreamPost
iDreamPost
లేళ్ల అప్పిరెడ్డి. ఈ పేరు గుంటూరు జిల్లా రాజకీయాల్లో అందరికీ చిరపరిచితం. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన అనేక ఆటుపోట్లు చవిచూశారు. పదవుల విషయంలో పలు మార్లు ఆశాభంగం ఎదురయినా పట్టువీడకుండా ముందుకు సాగారు. గుంటూరు నగరంలో పట్టు సాధించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. తొలుత కాంగ్రెస్ లో యువజన నేతగా ప్రస్థానం ప్రారంభించి, అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు. వైఎస్సార్ సన్నిహిత్యంలో కీలక నేతగా మారారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. చివరకు జగన్ చలవతో నేరుగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అవకాశం దక్కించుకున్నారు.
గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన నలుగురిలో అప్పిరెడ్డి ఒకరు. 1990లకు ముందే విద్యార్థి రాజకీయాల ద్వారా గుంటూరు ప్రజలకు ఆయన పరిచయమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతూ కీలక నేతగా ఎదిగారు. తొలుత ఎన్ఎస్ యూఐలో పనిచేశారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. జ్యూట్ మిల్లు, మిర్చి యార్డు ముఠా కార్మిక సంఘాలకు నాయకుడిగా వ్యవహరించారు. వైఎస్ హయంలో 2003లో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగానూ, 2007లో పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగానూ ఎదిగారు.
తొలుత ఆయన రాయపాటికి సన్నిహితుడిగా మెలిగారు. 2006లో మిర్చియార్డు చైర్మన్ గా వ్యవహరించారు. 2011 నుంచి గుంటూరు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయినా వెనకడుగు వేయలేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు. జగన్ గుంటూరు దీక్ష సహా విపక్షంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించారు 2019లో మారిన సామాజిక పరిస్థితులతో ఆయన సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. దానికి గుర్తింపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా జగన్ ఆయన్ని నియమించారు.
గుంటూరులో వివిధ కార్మిక, రాజకీయ ఉద్యమాల సందర్భంగా ఆయన పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. వాటిని కోర్టులు కొట్టేసినా లేళ్ల అప్పిరెడ్డి మీద ప్రత్యర్థులు వాటిని సాకుగా చూపించి నిందలు వేసే ప్రయత్నం చేశాయి. అయితే తాజాగా గవర్నర్ ఆమోదముద్ర పడడంతో ఆయనకు ఎమ్మెల్సీ హోదా దక్కడం గుంటూరు వైఎస్సార్సీపీ లో కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పవచ్చు. పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు ఉన్న అప్పిరెడ్డికి కీలక పదవిని కేటాయించిన జగన్ గుంటూరు రాజకీయాల్లో ఆసక్తికరమైన ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది.