iDreamPost
iDreamPost
బీహార్ లో కాంగ్రెస్ బలం కుచించుకుపోయింది. కామ్రేడ్లు అనూహ్యంగా పుంజుకున్నా కాంగ్రెస్ వైఫల్యం మూలంగా మహాకూటమి అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ మంత్రాంగం నడవలేదని తేలిపోయింది. మహాకూటమిలో ఫూర్ ఫెర్మార్మర్ గా కాంగ్రెస్ నిలిచింది. ఓవైపు ఎంఐఎం, మరోవైపు బీఎస్పీ కారణంగా కాంగ్రెస్ పునాది ఓటర్లు చేజారిపోతున్నట్టు స్పష్టమవుతోంది. అంతిమంగా కాంగ్రెస్ తో చేతులు కలపడం మూలంగానే తేజస్వీ యాదవ్ చేతులు కాల్చుకునే వరకూ వచ్చిందనే వాదన బలపడుతోంది.
అదే సమయంలో బెంగాల్ లో మాజీ శత్రువులు ఇప్పుడు మళ్లీ మిత్రత్వం కట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కలిసి సాగాలని కాంగ్రెస్, లెఫ్ట్ నిర్ణయించాయి. ఇప్పటికే ఈ కూటమి 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలు చూసింది.
అయినప్పటికీ మళ్లీ ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్న తీరు విశేషంగా మారుతోంది. బీజేపీని ఓడించాలని చెబుతూ, ఆపార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చి, టీఎంసీకి గండికొట్టేందుకు ఈ కూటమి ఉపయోగపడుతుందా అనే అనుమనాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ ఆశలకు బ్రేకులు వేస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే.
తాజగా ఓ ఇంటర్వ్యూలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తమ కూటమి గురించి స్పష్టత ఇచ్చేశారు. ఓవైపు బీహార్ లో లెఫ్ట్ కి మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లం అని ఆయన ప్రకటించారు. సీపీఎంకి కేవలం 4 సీట్లు మాత్రమే కేటాయించగా అక్కడ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ వ్యతిరేక ఓట్లు చీలికను నివారించే లక్ష్యం తో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సిపిఎం కేంద్రకమిటీ అంగీకరించిందని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ రూపంలో దేశం, తృణమూల్ రూపంలో బెంగాల్ ముందున్న ప్రమాదాలను ఎదుర్కోవటానికి కాంగ్రెస్‌తో సహా అన్ని లౌకిక పార్టీల తోనూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న పశ్చిమబెంగాల్ సిపిఎం శాఖ నిర్ణయాన్ని కేంద్ర కమిటీ తరుపున ఆమోదించామన్నారు.
గత ఏడాది కాలంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం రోజురోజుకూ తీవ్రమవుతోందని ఏచూరి అంటున్నారు. అందువల్ల బిజెపిని నిలువరించి ఓడించాల్సిన అవసరం మరింత ప్రాధాన్యత కలిగిన కర్తవ్యంగా భావిస్తున్నామని, 22వ పార్టీ మహాసభల నిర్ణయం ప్రకారం బిజెపిని ఓడించటమే ప్రధాన కర్తవ్యంగా కాంగ్రెస్ తో కలిసి సాగుతున్నట్టు తేల్చేశారు. తృణమూల్ పట్ల వ్యతిరేకత నానాటికీ పెరుగుతోందని., దానిని బీజేపీ సొమ్ము చేసుకోకుండా నిలువరిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన శతృవు బిజెపియేనని చెప్పారు. అయితే తృణమూల్‌ను ఓడించకుండా బిజెపిని ఓడించటం సాధ్యం కాదని, బెంగాల్‌లో బిజెపి వేళ్లూనుకునేందుకు అవకాశం ఇచ్చిందే తృణమూల్ కాంగ్రెస్. అందువల్ల తృణమూల్‌ను ఓడించకుండా రాష్ట్రంలో బిజెపిని ఓడించలేము అంటూ వివరించారు.
సుదీర్గకాలం పాటు కత్తులు దూసుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు గడిచిన 5 ఏళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో ఉమ్మడిగా పోరాడారు. కానీ ఫలితాలు ఆశించినట్టుగా లేవు. ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఉంటాయని ధీమాతో కనిపిస్తున్నారు. అయితే అది సాధ్యమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బీహార్ విజయం సాధించిన దూకుడుతో బీజేపీ మరింత దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా ఉన్న అధికారం అండతో మరింత చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్- కమ్యూనిస్టు కూటమి ప్రభావం ఏమేరకన్నది బెంగాల్ ఓటర్లు తేల్చాల్సి ఉంది.