Idream media
Idream media
లెబనాన్ రాజధాని బీరుట్‌లో కొద్ది రోజుల క్రితం భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనతో బీరుట్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సుమారు 160 మంది పేలుళ్లకు బలయ్యారు. భారీ భవంతులు క్షణాల వ్యవధిలో నేలమట్టమయ్యాయి. 6000 మందికి పైగా గాయపడ్డారు. బీరుట్ ఓడరేవు కేంద్రంగా బాంబు పేలుళ్లు విధ్వంసం జరిగింది. టపాసులు నిల్వ చేసిన గోదాములలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ భారీ విస్ఫోటనంపై ప్రజల నుంచి పెల్లుబుకిన ఆగ్రహజ్వాలలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. మహా విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసింది. ప్రధానమంత్రి హసన్ దియాబ్ ఇవాళ అధ్యక్ష భవనానికి వెళ్లి తమ అందరి తరపున రాజీనామా అందజేసినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. బీరుట్‌లో గత మంగళవారం చోటుచేసుకున్న భారీ పేలుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే ముగ్గురు మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
ఆదివారం సమాచార మంత్రి, పర్యావరణ మంత్రులు రాజీనామా చేయగా.. ఇవాళ న్యాయశాఖ మంత్రి మేరీ క్లాడ్ నజమ్ రాజీనామా చేశారు. గత మంగళవారం చోటుచేసుకున్న బీరుట్ పేలుడు కారణంగా పోర్టు మొత్తం భస్మీపటలం అయిపోయింది. ఎక్కడ చూసినా శిథిలాలు ఇప్పటికీ దర్శనం ఇస్తూనే ఉన్నాయి. క్షతగాత్రులు వేల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నాటి పేలుళ్ల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.