iDreamPost
android-app
ios-app

బీజేపీకి భ‌య‌ప‌డే ఆ నేత‌లు ఎవ‌రు? రాహుల్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

  • Published Jul 17, 2021 | 2:09 PM Updated Updated Jul 17, 2021 | 2:09 PM
బీజేపీకి భ‌య‌ప‌డే ఆ నేత‌లు ఎవ‌రు? రాహుల్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

”బీజేపీని ఎదుర్కోలేక భయపడే వాళ్లు స్వేచ్ఛగా పార్టీని వీడి వెళ్లిపోండి. వాళ్లంతా ఆర్ఎస్ఎస్ వ్యక్తులు. వాళ్లు వెళ్లిపోతారు. వెళ్లనీయండి. వాళ్లను మనం కోరుకోం. వారి అవసరం లేదు. భయమంటే తెలియని వ్యక్తులు మనకు కావాలి. అదే మన సిద్ధాంతం, నా సందేశం కూడా అదే” అంటూ రాహుల్ గాందీ చేసిన తాజా వ్యాఖ్య‌ల‌పై పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే, పార్టీ బయట ఉంటూ భయం లేని నేతలు కాంగ్రెస్‌లో వస్తామంటే స్వాగతిస్తామన్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ప‌రోక్షంగా బీజేపీయేత‌ర పార్టీల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కొద్ది రోజులుగా దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మేర‌కు ప‌లు పార్టీలు భేటీ కూడా అయ్యాయి. అయితే, ఇందులో కాంగ్రెస్ లేదు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీయే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ రూపకల్పనకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల టాక్. ఈ మేరకే కాంగ్రెస్‌ పరంగా స్పష్టతనిచ్చేందుకు, ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లో పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నాయి. బీజేపీ అంటే భయపడే వారిని బయటకు పంపిస్తామని, కావాలంటే వారు ఆర్‌ఎస్‌ఎస్‌ పంచన చేరవచ్చునంటూ రాహుల్‌ ఇందుకోసమే ప్రకటించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాహుల్‌ ప్రకటన కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Also Read : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారట.. కానీ..?

బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్‌ మాజీ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద లాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. కాంగ్రెస్‌లో మరికొందరు కూడా అలాంటివారు ఉన్నారని, వారికి, ప్రధాని మోదీతో అవగాహన ఉందని పార్టీలో అనుమానాలున్నాయి. గతంలో పార్టీ పనితీరు పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తూ లేఖాస్త్రం సంధించిన నేతల్లో కూడా మరికొంతమంది పార్టీ నుంచి నిష్క్రమించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి భయపడే వారు వెళ్లిపోవచ్చంటూ రాహుల్‌ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపాలనుకుంటున్న ప్రతిపక్షాలను దరిచేర్చుకునేందుకు కూడా ఈ ప్రకటన తోడ్పడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. రాహుల్‌ను కలిసినప్పుడు దేశంలో ఉన్న పార్టీలతోపాటు రాజకీయ నాయకులు కూడా బీజేపీ వైపా? కాంగ్రెస్‌ వైపా? అన్న స్పష్టత ఏర్పరచుకోవడం ప్రస్తుతం ఒక జాతీయ చారిత్రక అవసరమని చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌తోపాటు దేశంలో వివిధ పార్టీలన్నింటినీ ఒకే వేదికపై చేర్చే బాధ్యత ప్రశాంత్‌ కిషోర్‌ తీసుకున్నారని, ఆయన త్వరలో అన్ని పార్టీలను సంప్రదిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఐక్య కార్యాచరణకు సంబంధించి ఒక భూమిక ఏర్పడుతుందని, ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్‌తోపాటు అనేక పార్టీలు సిద్ధమయ్యాయని ఈ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఈ నెల 25న ఢి ల్లీ రావాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో ఆమె నాలుగు రోజులు ఉంటారని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, పార్లమెంట్‌లో వివిధ పక్షాల నేతలను కలుసుకుంటారని తెలిసింది. ఈ ప‌రిణామాల‌న్నీ కొత్త త‌ర‌హా కూట‌మికి దారి తీస్తాయ‌న్న సంకేతాలు ఇస్తున్నాయి.

Also Read : రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ గురించి తెలుసా..?