కేంద్ర మాజీ కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌పై దాఖలైన లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తీసుకుంది. గత సంవత్సరం మాజీ మంత్రి చిన్మయానంద్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కేసు వేసిన లా విద్యార్థిని మాట మార్చి తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెప్పడంతో లఖ్‌నవూలోని ప్రత్యేక కోర్టు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై సీఆర్‌పీసీ సెక్షన్ 340 (తప్పుడు దావా, తప్పుడు ప్రాసిక్యూషన్) కింద కేసు నమోదు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగింది..?
ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి చిన్మయానంద్‌కు పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయనకు చెందిన షాజహాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది.అనంతరం తిరిగొచ్చిన ఆ విద్యార్థిని చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సెప్టెంబర్ 5 న కేసు పెట్టడంతో ఈ ఘటనపై అనేక నిరసనలు చెలరేగాయి. అనంతరం సెప్టెంబరు 20 వ తేదీన చిన్మయానంద్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా తనను 5 కోట్లు డిమాండ్ చేసిందని చిన్మయానంద్ లా విద్యార్థినిపై కేసు పెట్టడంతో ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేసారు.
తదనంతరం గత సంవత్సరం డిసెంబర్‌లో కోర్టు విద్యార్థినికి బెయిల్ మంజూరు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్మయానంద్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మంగళవారం జరిగిన కోర్టు విచారణలో తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని యువతి చెప్పడంతో కోర్టు లా విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. కాగా ఉన్నట్టుండి లా విద్యార్థిని మాట మార్చడంతో ఈ కేసును నీరుగార్చేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.