iDreamPost
android-app
ios-app

సమోసాలో ఆలూ ఉంది కానీ బీహార్ రాజకీయాలలో లాలూ..?

సమోసాలో ఆలూ ఉంది కానీ బీహార్ రాజకీయాలలో లాలూ..?

లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో రాజకీయాలలోకి ప్రవేశించి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసించిన నేత. బీహార్ అనగానే తన పేరే గుర్తుకు వచ్చేంత ప్రభావం చూపిన వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. కానీ ఈసారి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో గతానికి భిన్నంగా కొత్త పంధా అనుసరిస్తుంది. దీంతో మొన్నటి వరకు బీహార్ రాజకీయాలలో చక్రం తిప్పిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుత ఎన్నికలలో ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

లాలూ ప్రసాద్ యొక్క ” జబ్ తక్ రహేగా సమోస్ మెయిన్ ఆలూ, తాబ్ తక్ రహేగా బీహార్ మెయిన్ లాలూ” (సమోసాలలో ఆలు ఉన్నంతవరకు బీహార్ రాజకీయాలలో లాలూ ఉంటాడు) అనేది బాగా ప్రాచుర్యం పొందిన నినాదం.1990 నుండి 2017 వరకు MY ఫార్ములా (ముస్లిం, యాదవ్ కలయిక)తో బీహార్ రాజకీయాలలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆధిపత్యం కాదనలేని నిజం. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన రాజకీయ వారసుడు,చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ తన తండ్రి మార్గానికి పూర్తి భిన్నంగా స్వంత గుర్తింపును బీహారీలలో ఏర్పరచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. పైగా తన తండ్రిపై పడ్డ అవినీతి ముద్ర నుండి ఆర్జేడీని బయటికి తేవడానికి కృషి చేస్తున్న తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో లాలూ పేరును ఎక్కడ ప్రస్తావించడం లేదు.దీంతో బీహార్ రాజకీయాలలో లాలూ శకం ముగిసినట్లే కనిపిస్తోంది.

వివిధ పశుగ్రాసం కుంభకోణ కేసులలో దోషిగా తేలిన లాలూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో “15 సంవత్సరాల ఎన్డీయే పాలన వర్సెస్ 15 సంవత్సరాల ఆర్జేడీ పాలన” ను ఎన్నికలలో ప్రధానాస్త్రంగా మార్చడానికి పాలక ఎన్డీయే వ్యూహాన్ని రచించింది. 1990- 2005 మధ్య 15 సంవత్సరాల లాలూ-రాబ్రీ పాలనని ‘జంగిల్ రాజ్’ అని అధికార ఎన్డీయే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. దీంతో కొన్ని నెలల క్రితం నాటి ఆర్జేడీ పాలనలో జరిగిన తప్పులకు కూడా తేజస్వీ యాదవ్ క్షమాపణలు కోరాడు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో స్వయంగా ఆర్జేడీ పార్టీని నడిపిస్తున్న తేజస్వీ యాదవ్ అధికార ఎన్డీయే ‘జంగిల్ రాజ్’ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తన తండ్రి లాలూ ప్రసాద్‌ను ఎన్నికలకు దూరం పెట్టాలని నిర్ణయించాడు. ఆర్జేడీ యొక్క ప్రచార పోస్టర్లలో లాలూ ప్రసాద్,రాబ్రీ దేవి ఫోటోలు ఎక్కడ కనిపించకుండా మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ జాగ్రత్త పడుతున్నాడు. అలాగే తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ని దూరం పెట్టడం వెనక అసలైన కారణం ఏమిటంటే 1990 తరువాత జన్మించిన 18-30 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 24 శాతం ఉన్న యువ ఓటర్లను లక్ష్యంగా తేజస్వీ చేసుకోవడమే. ఈ యువ ఓటర్లకు ఆర్జేడీ పాలన యొక్క జ్ఞాపకాలు బలంగా లేవని ఆయన విశ్వసిస్తున్నాడు.

ఇకపై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా కుల సమీకరణాలతో ఎన్నికలలో విజయం సాధించలేమని ఆర్జేడీ యువనేత తేజస్వీ బాగా అర్థమైంది. కేవలం యాదవులకే నాయకుడిగా కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి అభివృద్ధి-ఆధారిత నాయకుడిగా తన ఇమేజ్‌ను మార్చుకుంటున్నాడు. పార్టీ యొక్క లక్ష్యం యువ ఓటర్లు కావడం వల్ల ‘నయీ సోచ్ నయా బీహార్, అబ్కి బార్ యువ సర్కార్’ వంటి నినాదాలతో తనను తాను ‘బీహార్ కోసం కొత్త కిరణం’ గా ఓటర్ల ముందు ప్రోజెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమౌతుంది.

ఇక ఆర్జేడీ యొక్క ప్రధాన ఓటు బ్యాంకు 14 శాతం యాదవ్ మరియు 17 శాతం ముస్లింలు చెక్కుచెదరకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వడంతో టికెట్ పంపిణీలో కూడా కొత్త వ్యూహం ప్రతిబింబిస్తుంది. బీహార్‌లోని నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సంతృప్తి చెందని కులాలను ఆకర్షించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అయితే అభ్యర్థుల ఎంపికలో ఉన్నత కుల ప్రాతినిధ్యం శాతం ఎక్కువగా ఉండటం తేజస్వీ యాదవ్‌కి కొంత మైనస్ గా చెప్పవచ్చు.

ఇక సిబిఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న బినామి లావాదేవీలు,మనీలాండరింగ్ వంటి ఆర్థిక అవకతవకల కేసులు ఇప్పటికీ తేజస్వీ యాదవ్‌ని వెంటాడాయి. ఇవి బీహార్‌లో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఆయన ఆవిర్భావానికి కొంత ప్రతిబంధకంగా మారాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో లాలూ లేకపోవడం ముస్లిం ఓట్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో తేజస్వీ నాయకత్వంలోని ఆర్జేడీ గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుచుకోగలిగితే లాలూ వారసుడిగా అతని నాయకత్వానికి తిరుగుండదు. ఒకవేళ ఆర్జేడీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైతే అతని రాజకీయ భవిష్యత్తుపై భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారవుతుంది.

కాగా సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఎన్నికల సంగ్రామంలో ఆర్జేడీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రాష్ట్రంలో కోవిడ్ -19 నియంత్రణ,పెరిగిపోయిన నిరుద్యోగం,క్షీణించిన శాంతి భద్రతలు,వరద సహాయక చర్యలు,వలస కార్మికుల జీవనోపాధి వంటి సమస్యల పరిష్కారంలో ఎన్డీఏ విఫలమైందని ఆర్జేడీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

తన తండ్రి లాలూప్రసాద్ నీడ నుండి బయటపడి తేజస్వీ యాదవ్ స్వయంగా ప్రకాశిస్తాడా..?లేదా అనేది నవంబర్ 10న తేలనుంది.