iDreamPost
android-app
ios-app

Lakkireddy balireddy – లక్కిరెడ్డి బాలిరెడ్డి – మైలవరం నుంచి అమెరికా వరకు

  • Published Nov 09, 2021 | 5:01 AM Updated Updated Nov 09, 2021 | 5:01 AM
Lakkireddy balireddy – లక్కిరెడ్డి బాలిరెడ్డి – మైలవరం నుంచి అమెరికా వరకు

కృష్ణా జిల్లా మైలవరంలో విద్యాసంస్థలను నెలకొల్పి వేలాదిమందికి విద్యాదానం చేస్తున్న లక్కిరెడ్డి బాలిరెడ్డి మృతి చెందారని తెలుస్తోంది. విద్యకు ఎడారి ప్రాంతం అని సర్ సి వి రెడ్డి అన్నట్టు ఒకప్పుడు విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎలాంటి విద్యాసంస్థలు లేనివే. ప్రత్యేకించి పశ్చిమ కృష్ణా జిల్లాలో నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో విద్యాసంస్థలు అసలు ఉండేవి కాదు. అందుకే సి ఆర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని విద్యా ఎడారి అన్నారు. 

అటువంటి రోజుల్లో అంటే 1998 లో ఈ ప్రాంతానికి చెందిన లక్కిరెడ్డి బాలిరెడ్డి తన పేరుతో మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. ఇంజనీరింగ్ విద్య రాష్ట్రంలో అప్పుడే అందుబాటులోకి వస్తున్న రోజుల్లో అన్ని హంగులతో లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఈ ప్రాంత ప్రజలకు గొప్ప ఊరట ఇచ్చిందని చెప్పాలి. అలాగే ఈ ఒక్క కాలేజీ మాత్రమే కాక అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రభుత్వ కళాశాలను బాలిరెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ రెండు సంస్థల్లో సదుపాయాలు మెరుగు పర్చి వాటిని కార్పొరేట్ సంస్థల స్థాయిలో నిలబెట్టారు. 

మైలవరం ప్రాంతంలో విద్యా సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పలు సదుపాయాలు కల్పించడంలో కూడా బాలిరెడ్డి చాలా చొరవ చూపించారు. తన స్వగ్రామం వెల్వడం ని బాలిరెడ్డి పూర్తిగా దత్తత తీసుకున్నారు. గ్రామంలో మంచినీరు సదుపాయం కల్పించారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. అలాగే ప్రాధమిక వైద్య సదుపాయాలు కూడా కల్పించారు. తన సేవా కార్యక్రమాల ద్వారా గ్రామంలోని ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ సేవా కార్యక్రమాలతో జన్మభూమిని మర్చిపోలేదని తెలియజేసి ఆ ప్రాంత ప్రజల అభినందనలు అందుకున్నారు. 

ఇవన్నీ బాలిరెడ్డి సేవలకు ఒక ఎత్తయితే ఈ ప్రాంతం నుండి వందలాది మంది యువతీ, యువకులను అమెరికా తీసుకెళ్ళి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఒక దశలో ఈ ప్రాంతం నుండి అమెరికా వెళ్ళని యువతీ, యువకులు లేరని చెప్పేవాళ్ళు. పిల్లలు అమెరికా వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేస్తూ అంతో, ఇంతో తల్లిదండ్రులకు పంపించడం, దాంతో ఇక్కడ తల్లిదండ్రుల ఆర్ధిక స్థితి మెరుగుపడడం చాలా గొప్పగా చెప్పేవారు. యువతీ, యువకులకు వీసా, పాస్ పోర్టు సదుపాయం కూడా ఆయనే కల్పించేవారు. ఆయనకు తోడు ఆయన బంధువులు కూడా చాలా మంది బాలిరెడ్డి చేస్తున్న కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తుండే వారు. 

కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు అంటారు. అది బాలిరెడ్డి విషయంలో నిజం అయింది. దొంగ పాస్ పోర్టులు వంటి నేరారోపణలు ఆయనపై వచ్చాయి. ఎక్కడ ఎలాంటి తప్పిదం జరిగిందో కానీ ఈ ఆరోపణల కారణంగా అమెరికాలో ఆయన అరెస్టు అయ్యారు. జైలు జీవితం కూడా అనుభవించారు.

జైలు జీవితం బాలిరెడ్డిలో చాలా మార్పు తెచ్చింది. జైలు నుండి విడుదల అయ్యాక ఆయన  సేవా కార్యక్రమాల దూకుడు తగ్గించారు. తన దృష్టి అంతా తాను నెలకొల్పిన విద్యాసంస్థల అభివృద్ధిపైనే నిలిపారు. ఆ విద్యాసంస్థలు ఇప్పుడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే గొప్ప గుర్తింపు సాధించాయి. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యలో ఓ కొలమానంగా ఎదిగింది. ఈ విద్యాసంస్థల వల్ల ఈ ప్రాంతం, ప్రత్యేకించి మైలవరం, రెడ్డిగూడెం ప్రాంతాల్లో చాలా మార్పు వచ్చింది.