ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబర్ 3వ తేదీన చోటుచేసుకున్న హింస దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఘటన పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తేల్చింది.
ఇక సుదీర్ఘ విచారణ తర్వాత, టికునియా హింసాకాండ తర్వాత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ముగ్గురు నిందితులను కొట్టి చంపిన కేసులో సిట్ శుక్రవారం సిజెఎం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు నిర్దోషులుగా తేలడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సిట్ తరపున దర్యాప్తు అధికారి ధీరేంద్ర పాండే 1300 పేజీల ఛార్జిషీట్‌తో పాటు నలుగురు నిందితులపై తుది నివేదికను సిజెఎం కోర్టులో దాఖలు చేశారు. జైలులో ఉన్న ఏడుగురు రైతులలో ముగ్గురు నిందితులు అవతార్ సింగ్, రంజిత్ సింగ్ మరియు సోనూ అలియాస్ కమల్జీత్ సింగ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు.
దీంతో కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన సిజెఎం చింతారామ్, అవతార్ సింగ్, రంజీత్ సింగ్, సోనూ అలియాస్ కమల్‌జిత్ సింగ్‌లను ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ అందించి విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకు, ముగ్గురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. ఇద్దరు బిజెపి కార్యకర్తలు మరియు డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో లఖింపూర్ ఖేరీ హింస కేసులో నలుగురు రైతులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.