iDreamPost
android-app
ios-app

Ladakh – భూతల స్వర్గం గడ్డకట్టుకుపోతోంది..!

  • Published Dec 15, 2021 | 2:32 PM Updated Updated Dec 15, 2021 | 2:32 PM
Ladakh – భూతల స్వర్గం గడ్డకట్టుకుపోతోంది..!

హిమాలయ పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలులతో ఉత్తరాదిని చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా జమ్మూ కాశ్మీర్, సిమ్లా, డెహ్రాడూన్‌, డార్జిలింగ్‌, గ్యాంగ్‌టక్‌లతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లడఖ్‌ అయితే మంచుతో గడ్డకట్టుకుపోతోంది. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలే మైనస్‌లలో నమోదు కావడం గమనార్హం. లడఖ్‌లో బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత మైనస్‌ 16 డిగ్రీలు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్‌ 22 డిగ్రీలు. ముందు ముందు మరింత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పొగలు కక్కే నీరు గ్లాసులో పోసుకుని తాగేలోపే గడ్డకట్టుకుపోతుంది.లేహ్ లో గరిష్ఠం మైనెస్‌ తొమ్మిది డిగ్రీలు కాగా, కనిష్ఠం మైనెస్‌ నాలుగు డిగ్రీలుగా ఉంది.

జమ్మూ కాశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ మూడు డిగ్రీలు నమోదయ్యింది. ఇక్కడ గత ఏడాది కన్నా ఈ సీజన్‌లో రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంది. దీనితో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు కేవలం ఆరు డిగ్రీలుగా ఉంది. సిమ్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్‌ 2 డిగ్రీలు, ఉత్తరాఖండ్‌లో మైనస్‌ ఒక డిగ్రీ నమోదయ్యింది.

దీనితోపాటు ఉత్తరాదిలో పర్యాటక ప్రాంతాలుగా పేరొందిన డార్జిలింగ్‌, గ్యాంగ్‌టక్‌లలో ఏడు డిగ్రీలు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయాలలో 7 నుంచి 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలున్నాయి. పొగ మంచు కూడా దట్టంగా కమ్ముకుంటోంది. దీని వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అసలే ఢిల్లీ గత రెండు నెలలుగా కాలుష్యం కోరలలో చిక్కుకుని విలవిలలాడుతుంది. పొగ కమ్ముకుని ఢిల్లీ వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించే చర్యలు తీసుకోవాలని దేశ ఉన్నత న్యాయస్థానమే కన్నెర్ర జేస్తోంది. కాలుష్యానికి ఇప్పుడు పొగ మంచు తోడు కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

Also Read :  కొల్లేరుకు రెగ్యులేటర్‌..!

ఉత్తరాదితో పోల్చుకుంటే దేశం మధ్యలో ఉన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గినా ఇప్పటికీ 15 నుంచి 20 మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. వీటికన్నా తెలంగాణా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 20 నుంచి 26 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.