ఆంధ్ర ప్రదేశ్ న్యాయ రాజధాని మీద ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే దీనిపైచకా చకా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం కర్నూల్ జగన్నాథ గుట్ట వద్ద 250 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే మంత్రి మండలి సమావేశం లో చర్చించి తగు తీర్మానం చేయనున్నారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే కోర్టు పనులు వేగంగా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సుప్రీం కూడా ఓకే చెప్పడంతో
హైకోర్టును కర్నూలు కు తరలించే విషయంలో తామేమీ జోక్యం చేసుకోమని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నోటిఫై చేసి, ప్రత్యేక గెజిట్ ద్వారా హైకోర్టును ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం కానుంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు లో అందరికీ అందుబాటులో, విశాలంగా ఉండే స్థలాన్ని తీసుకోవాలని భావించింది. దింతో పాటు ఏక బిట్ మొత్తంగా తాళం సేకరిస్తే భవిష్యత్తు అవసరాలకు ఉంటుందని భావించే జగన్నాథ గుట్ట వద్ద రెండు వందల యాభై ఎకరాలను గుర్తించారు. దీనిలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూమి ఉంది. మిగిలినది సేకరించాల్సి ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం తర్వాత ఈ పనులు చకచకా జరగనున్నాయి.
అన్ని ఏర్పాట్లు!
కేవలం హైకోర్టు తరలింపు మాత్రమే కర్నూలుకు పరిమితం చేయకుండా అక్కడ న్యాయ రాజధానిగా చేసేందుకు పలు పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయమూర్తులు, సిబ్బంది కీ క్వార్టర్ లతో పాటు, న్యాయ సహాయం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు కు చేరుకునే వారికి ప్రత్యేకమైన వసతి కేంద్రం సైతం న్యాయ రాజధానిలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏదైనా అవసరం వస్తే ఇక్కడ ఉండేలా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. దింతోపాటు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటుకు, ప్రత్యేక oవసతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
వేగంగా నిర్మాణం!
పరిపాలనా రాజధానిగా విశాఖకు పాలన తరలించిన తర్వాత కర్నూలు పైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే న్యాయ రాజధాని పై ప్రత్యేకమైన డీపీఆర్ తయారు చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుమారు 1500 కోట్లు దీనికి ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిలో మార్పులు చేర్పులు ఏమైనా సూచిస్తే కనుక దీనిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం అమరావతిలో పూర్తయిన శాశ్వత హైకోర్టు భవనాలను వేరే శాఖలకు కేటాయించి, వాటిని సైతం సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసింది. దానిలో కొన్ని కొన్ని మార్పులు చేస్తే వివిధ శాఖల కార్యాలయాలకు హైకోర్టు భవనం చాలా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీంతో ఆ నిర్మాణాలను చెక్కుచెదరకుండా ఉపయోగించుకునేందుకు సైతం ప్రభుత్వం సిద్ధం అవుతోంది.