iDreamPost
iDreamPost
కుప్పం ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ పరువును కాపాడేలా ఓటమికి కారణాలను సిద్దం చేసేపనిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులకు కలుగుతున్నాయి. ఆయన చేస్తున్న విమర్శలే అందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్లతో జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని, నడిబజారులో అంగడి సరుకు చేశారని లోకేశ్ సోమవారం విమర్శించారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైఎస్సార్సీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు.
పోలింగ్ రోజున ఉద్దేశ పూర్వకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అటు ఓటర్లను, ఇటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయన లక్ష్యం అని అనుమానం కలుగుతోంది. కుప్పంలో పోలింగ్ సందర్భంగా అరాచకాలు జరిగిపోయాయని జనం అనుకోవాలనేది ఆయన వ్యూహం. ఒకవేళ ఓడిపోయినా అధికార పార్టీ దౌర్జన్యాలే కారణమని చెప్పుకోవడానికి వీలు ఉంటుంది.
ఆది నుంచి అంతే
స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి టీడీపీ నాయకులకు గెలుపుపై నమ్మకం లేకపోవడంతో అధికార వైఎస్సార్ సీపీని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (సీఎస్ఈ)ను టార్గెట్ చేసేలా వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సీఎస్ఈకి సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో అర్థం పర్థంం లేని ఆరోపణలు, డిమాండ్లు చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని, నామినేషన్ల ఉప సంహరణ సమయంలో అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులను సాక్షులుగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
Also Read : Chandrababu, Fake Votes Allegations – కుప్పంలో తిరుపతి సీన్ రిపీట్
ఈ ఎన్నికల్లో వలంటీర్ల జోక్యం లేకుండా నిఘా పెట్టాలని, బలవంతపు ఏకగ్రీవాలను పరిగణనలోకి తీసుకోరాదని ఆ లేఖలో కోరారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే సదరు లేఖను రూపొందించారని అప్పట్లోనే అనుమానాలు వచ్చాయి. తాజాగా లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి.
జగన్ పాలనపై జనం ఆగ్రహంతో ఉన్నారట..
పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని జగన్‌రెడ్డి తెలుసుకున్నారని లోకేశ్ అన్నారు. డెమోక్రసీ పద్ధతిలో జరగాల్సిన ఎలక్షన్‌ని ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో జరిగే సెలెక్షన్ గా మార్చేశారని లోకేశ్ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. అంటే జగన్మోహనరెడ్డి పాలనపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది కానీ అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు, ఎస్ఈసీ సహకరించడం వల్లే తమ పార్టీ ఓడిందని చెప్పుకోడానికి స్కెచ్ వేశారని అర్థమవుతోంది.
ఏళ్ల తరబడి కుప్పం ప్రజల ఇబ్బందులను పట్టించుకోని నేపథ్యం ఇప్పుడు ఓటమికి దారితీస్తుందనే భయమే టీడీపీ నేతల వ్యాఖ్యలకు కారణమని అర్థమవుతోంది. అందుకే ఒకపక్క పోలింగ్ జరుగుతుంటే పొలీసులపై టీడీపీ క్యాడర్ దాడులు చేయడం, మరోపక్క జనాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు పరువుకు, టీడీపీ ఉనికికి కీలకమైన కుప్పం ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత దూరం అవుతుంది.
Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?