iDreamPost
android-app
ios-app

కుంభారవి,ఫలించిన పదేళ్ల నిరీక్షణ

కుంభారవి,ఫలించిన పదేళ్ల నిరీక్షణ

మొత్తానికి వైఎస్ జగన్ తో కలిసి పని చేయాలి, ఆయనతో నడవాలని ఆశించిన ప్రాఫెసర్ కుంభా రవిబాబుకు ఆ ఆవకాశం వచ్చింది, 2011 నుంచి దాదాపు పదేళ్లుగా జగన్ వెంట ఉంటూ వచ్చిన ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే రవి బాబుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టు దక్కింది.

ఆంధ్రా యూనివర్సిటీ అధ్యాపకుడిగా మంచి వాగ్దాటి , పలు రాజకీయ సామాజిక అంశాలమీద లోతైన విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడిగా ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన రవిబాబు వైఎస్సార్ చలవతో 2004లో ఎస్కో.ట నుంచి బరిలోకి దిగి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా హైమావతిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఓటమిపాలైనా వైఎస్సార్ వెంటే ఉంటూ వచ్చారు.

Also Read:ఆత్మకూర్ – చైర్మన్ పదవి చేపట్టనున్న “బంగారు” డాక్టరమ్మ

ఆ నాటి నుంచి జగన్ పట్ల అభిమానం చూపుతూ అప్పట్లో జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర, షర్మిళ చేపట్టిన పాదయాత్రల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అరకు ఆసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అంతకు ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ నియోజకవర్గంలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను వైఎస్సార్ మద్దతుదారులతో గెలిపించారు.

అయితే 2014లో పలు స్థానిక కారణాలు ఆయనకు అరకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవడానికి కారణమయ్యాయి. దీంతో కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు టీడీపీలో చేరారు,కానీ పోటీచేసే అవకాశం రాలేదు.ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. అయితే కొన్నాళ్లకే కిడారి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరి, మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోగా ఆయన కుమారుడు శ్రవణ్ కుమార్ ఓ ఆర్నెళ్ల పాటు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అయ్యారు.

Also Read:గంటా చేరికకు అంతా సిద్ధం…?

2019 ఎన్నికల్లో మళ్లీ జగన్ వెంట చేరిన రవిబాబు విశాఖ మన్యంలో విస్తృతంగా పర్యటించారు. విశాఖ ఏజెన్సీ ప్రజలతోను, నాయకులు, అధికారులతో అమితమైన పరిచయాలున్న రవిబాబు ప్రతిపల్లెకూ వెళ్లారు. జగన్ గురించి, రాబోయే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, గిరిజనులకు ఆవి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించడంలో కృతకృత్యుడయ్యారు.

ఇదే క్రమంలో మళ్లీ 2019లో టిక్కెట్ ఆశించినా దక్కలేదు, శెట్టి ఫల్గుణకు దక్కింది. అయినా సరే ఆయన విజయానికి శతథా యత్నించి ఫల్గుణను విజయతీరాలకు చేర్చారు. జగన్ పట్ల ఆయనకున్న అమితమైన అభిమానం, గౌరవాలు ఆయనకు ఇన్నాళ్లకు ఓ గుర్తింపును తెచ్చి పెట్టాయి. రాష్ట్రస్థాయి పదవి, కేబినెట్ – హోదా ఉన్న కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు రాజకీయ, సామాజిక అంశాలపై విస్తృత అవగాహన, వాగ్దాటి కలిగిన రవిబాబు ఈ పదవికి న్యాయం చేస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు