పాక్ చెరలో ఉన్న మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో భారత్ మరో విజయం సాధించింది. ఈ కేసులో పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. వియత్నాం ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందంటూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దుల్‌ఖావీ యూసఫ్ తాజాగా విన్నవించారు. సాధారణ సభకు బుధవారం సమర్పించిన తన నివేదికలో పూర్తి వివరాలను అందించారు. ఈ ఏడాది జులై 17న ఇచ్చిన తీర్పులో ఇదే విషయాన్ని తెలిపామన్న ఆయన.. వియత్నం ఒప్పందంలోని ఆర్టికల్ 36ను పాకిస్థాన్ ఉల్లంఘించిన విషయాన్ని చెప్పారు.
గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాదవ్‌ను 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అనంతరం 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించగా.. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసింది. ఈ కేసులో వాదనల అనంతరం ఉరిశిక్షను పునఃసమీక్షించాలంటూ ఈ ఏడాది జులై 17న ఐసీజే తీర్పు ఇచ్చింది. ఆయన నిర్బంధాన్ని తప్పుబట్టిన కోర్టు.. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఆదేశించింది.