iDreamPost
android-app
ios-app

కేసీఆర్‌ మనవడు రాజకీయాల్లోకి రాడట..!

కేసీఆర్‌ మనవడు రాజకీయాల్లోకి రాడట..!

సినిమాలు, రాజకీయాల్లో వారసత్వం సర్వసాధారణం. కుమారులు, మనవళ్లే కాదు అవకాశం వస్తే.. బంధువులు కూడా వారి మార్గంలోకి వెళ్లాలని ఆశిస్తారు. రాజకీయ నేతల కుమారులు, మనవళ్లు .. తండ్రి, తాత వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటనలు చేయడం నిత్యం చూస్తూనే ఉంటాం. ఉన్నతమైన స్థాయిలో ఉండే నేతలు.. తమ తదుపరి వారసుడుని తయారు చేస్తుంటారు. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు నడవాలనుకుంటున్నారట. తాను తన తాత, తండ్రిల మాదిరిగా రాజకీయాల్లోకి రాబోనని హిమాన్షు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని హిమాన్షు కుండబద్ధలు కొట్టారు. తన లక్ష్యాలు, సా«ధించాల్సిన గోల్స్‌ వేరే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతకీ ఆ గోల్స్‌ ఏమిటనేది హిమాన్షు వెల్లడించలేదు.

ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న హిమాన్షు.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఇటీవల డయానా అవార్డు వరించింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో పని చేసే వారికి బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ అవార్డు అందిస్తుంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు చేయాల్సిన పనులపై సోమ అనే పేరుతో హిమాన్షు రూపొందించిన ప్రాజెక్టుకు డయానా అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టును గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లిలో చేపట్టారు హిమాన్షు.

Also Read : జేసీ బ్రదర్స్ కు అంత ప్రేమ ఎప్పటినుంచో?

ప్రత్యేక తెలంగాణ కావాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీని స్థాపించిన కేసీఆర్‌.. ఆ లక్ష్యాన్ని చేరుకుని 2014 నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ బాధ్యతలు చేపడతారని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కేటీఆర్‌ పని చేస్తున్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్‌కు అప్పగిస్తారనే చర్చ, సీఎం పదవికి కేటీఆర్‌ అర్హుడనేలా పలువురు మంత్రులు ఇటీవల ప్రకటనలు చేశారు.

కేటీఆర్‌ కన్నా సీనియర్‌గా కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు ఉన్నా.. కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆరేనని తేలిపోయింది. అయితే కేటీఆర్‌ తర్వాత ఆయన కుమారుడు హిమాన్షు వారసత్వాన్ని కొనసాగిస్తారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా హిమాన్షు ప్రకటన ఉండడం గమనార్హం. హిమాన్షు వయస్సు దృష్ట్యా అతను చేసిన ప్రకటనను టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దగా పట్టించుకుంటాయనుకోలేం. సమయం వచ్చినప్పుడు.. తాత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని హిమాన్షు ప్రకటిస్తారని గులాబి శ్రేణులు భావిస్తున్నాయి.

Also Read : ఆ ఘనత ఎవరిది అచ్చెం నాయుడు..?