తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ స్పీడు పెంచుతుంటే మరో వైపు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిన్నా మొన్నటి దాకా బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అదే సమయంలో సంస్థాగత మార్పులపైనా దృష్టిసారించినట్లు అర్థమవుతోంది. గత కొంత కాలంగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా ఈ నేపథ్యంలో జరుగుతున్నదే. తాజాగా ఈ ప్రచారానికి బలం చేకూర్చే వ్యాఖ్యలు చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు గుత్తా సుఖెందర్ రెడ్డి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ మనసులో మాటను వెల్లడించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, పార్టీలో సాధారణ కార్యకర్తల నుంచి అందరితోనూ సత్సంబధాలున్నాయని అన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలు అనర్గళంగా మాట్లాడగడరని, ప్రజలను ఆకర్షింగల నేత అని, పాలనా సామర్థ్యం గల వ్యక్తి అని కొనియాడారు. కేటీఆర్ సీఎం పదవికి అర్హుడు అనడానికి ఇంతకంటే ఇంకేవాలన్నారు.
ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మార్చిలోపు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సుఖెందర్ రెడ్డి సైతం అదే సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచిన నేపథ్యంలో కేసీఆర్ ఈ మార్పుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వంలో మార్పులకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు ప్రచారం.
రాష్ట్రంలో ఓ వైపు బీజేపీ బలం పుంజుకుంటోంది. మరోవైపు కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ మద్దతు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు, అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే రంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా గుత్తా సుఖెందర్ రెడ్డి వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. మరి ఆ ముహుర్తం ఎప్పుడో వేచిచూడాలి.