iDreamPost
android-app
ios-app

జ‌ల వివాదం ప‌రిష్కారం.. జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లే జ‌రిగింది..!

జ‌ల వివాదం ప‌రిష్కారం.. జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లే జ‌రిగింది..!

తెలంగాణ నీటి వృథాను అడ్డుకోండి, లేదా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోండి అంటూ.. జగన్ చేసిన విన‌తికి ఆమోద ముద్ర ల‌భించింది. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న జ‌ల వివాదాల‌కు చెక్ ప‌డ‌నుంది. కేంద్రం జోక్యం తీసుకుని ప‌రిధుల‌ను నిర్ణ‌యించ‌డంతో స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చిన‌ట్ల‌యింది.

నోరు పారేసికుని అన‌వ‌స‌ర ఆందోళ‌న‌ల‌ను సృష్టించ‌కుండా స‌మ‌స్య ప‌రిష్క‌రానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సావ‌ధానంగా ప్ర‌య‌త్నించారు. స‌మ‌స్య‌కు గ‌ల కార‌ణాల‌ను, ప‌రిధుల నిర్ధార‌ణ కాక‌పోవ‌డంతో వ‌స్తున్న త‌గువుల‌ను త‌న లేఖ‌ల ద్వారా కేంద్రానికి వివ‌రించారు. ప‌లు ప‌రిష్క‌రాల‌ను కూడా సూచించారు. ఫ‌లితంగా గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇటీవ‌ల తీవ్ర స్థాయికి..

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి.

ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఫ‌లితంగా అడ‌పాద‌డ‌పా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల అవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు రాష్ట్రాల మంత్రులూ ఒక‌రిపైమ‌రొక‌రు మాట‌లు జారారు. జ‌గ‌న్ మాత్రం త‌న లేఖ‌ల ద్వారా కేంద్రానికి స‌మ‌స్య‌ను స‌వివ‌రంగా విన్న‌వించారు.

ప్రధానికి రెండు దఫాలు జగన్‌ లేఖలు

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్‌ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్‌ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని వివ‌రిస్తూ, తెలంగాణ సర్కార్‌ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్‌ షెకావత్‌లకు లేఖలు రాశారు.

జ‌గ‌న్ సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి..

గతేడాది అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని ఆయా లేఖ‌ల్లో జ‌గ‌న్ కోరారు. తెలంగాణ సర్కార్‌ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు సుప్రీం కోర్టులో కూడా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.