iDreamPost
android-app
ios-app

కరకట్ట ఇంటికి మరోసారి వరద ముప్పు

  • Published Sep 28, 2020 | 10:53 AM Updated Updated Sep 28, 2020 | 10:53 AM
కరకట్ట ఇంటికి మరోసారి వరద ముప్పు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంగా ఉన్న కరకట్ట భవనానికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కృష్ణా నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాల్లో జలమయమవుతున్నాయి. వరద సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.

గత ఏడాది కంటే ఈ సంవత్సరం కృష్ణా నదికి ఎక్కువ వరదవస్తుంది. ఇప్పటికే రెండు సార్లు శ్రీశైలం గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం కృష్ణ నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు అంటే జూరాల,శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల మరియు ప్రకాశం బ్యారేజి పూరిస్థాయిలో నిండుతుండటంతో అన్ని ప్రోజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఈ సీజన్లో దాదాపు 500 టీఎంసీ ల నీరు ఇప్పటికే సముద్రం పాలయిందని ఒక అంచనా.

గత సంవత్సరం కృష్ణాకు వచ్చిన భారీ వరదతో కరకట్ట మీద నిర్మించిన చంద్రబాబు ఇంటి అంచుల వరకు వరద నీరు చేరింది. అయితే చంద్రబాబు ఇంటిని ముంచటానికే నీటిని సరైన సమయంలో సముద్రంలోకి వదలలేదని చంద్రబాబు,లోకేష్ తో సహా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఉన్న డెబ్భై గేట్లలో ఒక గేటులో ఒక నాటు పడవ ఇర్రుకోని పోగా దాన్ని ప్రభుత్వమే అక్కడ ఇరికించిందని,చంద్రబాబు ఇంటిని ముంచటానికే అలా చేసారంటూ లోకేష్ హాస్యాస్పద విమర్శలు చేశారు.

అయితే ఈ సంవత్సరం కూడా కరకట్టకు దిగువన నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్ భవనం వరుసగా రెండో ఏడాది కూడా నీటమునిగే ముప్పుని ఎదుర్కొంటోంది. ఇప్పటికే కరకట్టను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. నోటీసులు ఇచ్చి వాటిని తొలగించాలని ఆదేశించింది. అయితే కోర్టు లలో వ్యాజ్యాల పేరుతో దానిని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆక్రమణలు తొలగించకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిబందనల ప్రకారం రెవెన్యూ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న గుంటూరు మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణానికి చెందిన ఫామ్ హౌస్ లో కొంత మేరకు కూలగొట్టారు. ఆక్రమించి నదీ గర్భంలో నిర్మించిన ప్రాంతాన్ని తొలగించారు.

అయితే లింగమనేని ఎస్టేట్స్ తో పాటు మరికొన్ని భవనాల నిర్మాణాలకు నాటి పంచాయితీల అనుమతులను చూపించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నిలువరుస్తున్న తరుణంలో వరుసగా రెండో ఏడాది కూడా నది వరద ఉధృతి విలయం సృష్టించేలా కనిపిస్తోంది. ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి వస్తున్న ఇన్ ఫ్లోస్ కారణంగా ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. దాని ప్రభావంతో చంద్రబాబు నివాసం చేరువలో వరద తాకిడి సాగుతోంది. ఇది మరింత పెరిగితే గతంలో మాదిరిగా చంద్రబాబు నివాస ప్రాంగణంలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. గడిచిన ఏడు నెలలుగా ఆయన అమరావతికి దూరంగా ఉంటున్నారు. కరోనా సమయంలో ఆయన నివాసం ఖాళీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరద తాకిడి మొదలవుతున్నందున ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ప్రస్తుతం వరద తాకిడి పెరగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని,వరద పెరుగుతున్నందున ఖాళీ చేయాల్సి వస్తే సన్నద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ రెవెన్యూ అధికారులు చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించారు. చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.