iDreamPost
iDreamPost
తొమ్మిది నెలలకు పైగా థియేటర్లు మూతబడి ఇటీవలే తెరిచినా ఇంగ్లీష్ సినిమాలు తప్ప ఇంకే ఎంటర్ టైన్మెంట్ లేక అలో లక్ష్మణా అంటున్న తెలుగు ప్రేక్షకులకు ఊరట కలిగించేలా ఒక్కో ప్రకటన వస్తోంది. ఈ నెల 25 నుంచి సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ థియేటర్లు కన్ఫర్మ్ అయిపోయి వాటి తాలూకు లిస్టుతో పేపర్లో యాడ్స్ కూడా ఇచ్చేశారు. సో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. తాజాగా మరో పెద్ద హీరో సినిమా కూడా డేట్ లాక్ చేసుకుంది. మాస్ మహారాజా ‘క్రాక్’ 2021 జనవరి 14న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అప్పుడెప్పుడో దీపావళి రోజు సంక్రాంతికి మేమంటే మెమోస్తున్నామని చాలా సినిమాలు అనౌన్స్ మెంట్లు ఇచ్చాయి ఖచ్చితంగా తేదీతో సహా చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. పైపెచ్చు ఒకరో ఇద్దరో డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో క్రాక్ ఇంత క్లారిటీతో ఉండటం మంచిదే. అందరి కన్నా ముందు సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్నీ ప్రకటిస్తూ రీ రికార్డింగ్ ఫుల్ స్వింగ్ లో ఉందని త్వరలో ట్రైలర్ వచ్చేస్తుందని, జనవరి 14న సిద్ధంగా ఉండమని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా అన్నీ తీరిపోయినట్టే. ఇకపై వరసగా కన్ఫర్మేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ లో శృతి హాసన్ హీరోయిన్. ఇటీవలే కీలకమైన గోవా షెడ్యూల్ లో పాల్గొంది. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సముద్రం నేపధ్యంగా తీసుకుని క్రాక్ ని రూపొందించారు. సముతిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ విలన్లుగా నటించడం ఆసక్తిని పెంచుతోంది. వరస డిజాస్టర్ల తర్వాత రూపొందినప్పటికీ క్రాక్ మీద బిజినెస్ సర్కిల్స్ లోనూ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. భారీ హిట్టుతో మునుపటి ఫామ్ దక్కడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఎవరూ పోటీగా లేని సంక్రాంతిని క్రాక్ కనక సరిగా వాడుకుంటే వసూళ్ల జాతర మాములుగా ఉండదు