iDreamPost
android-app
ios-app

TDP – రాజీమార్గంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

  • Published Dec 12, 2021 | 2:17 PM Updated Updated Mar 11, 2022 | 10:31 PM
TDP – రాజీమార్గంలో మాజీ ఎంపీ, మాజీ  ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు మరో మలుపు తిరిగాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గం విషయంలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలను సర్దుబాటు చేసుకునే దిశగా చర్చలు జరిగాయి. ఎమ్మిగనూరులో పార్టీ ఇంఛార్జి జయనాగేశ్వర్ రెడ్డి ప్రమేయం లేకుండా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సొంత కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఇంఛార్జీతోపాటు పార్టీ కార్యకర్తలు కోట్ల అక్కడి నుంచి పోటీ చేస్తారేమోనని భావించారు.

టీడీపీ ఇంఛార్జి పార్టీని వీడతారని ప్రచారం

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలక నేతగా ఉండి,మంత్రిగా పని చేసిన బి.వి.మోహన రెడ్డి కుమారుడైన జయనాగేశ్వర్ రెడ్డి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2019లో ఓటమిచెందారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నడుస్తోంది. అయినా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల అక్కడ మరో కార్యాలయం ఏర్పాటు చేయడం కలకలం రేపింది. దీనిపై పార్టీ ఇంఛార్జి జయనాగేశ్వర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. పార్టీ శ్రేణుల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. జయనాగేశ్వర్ టీడీపీని వీడిపోతారన్న ప్రచారం కూడా జరిగింది. 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమ్మిగనూరు నుంచి గెలిచాడు.దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మళ్లీ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారన్న అనుమానాలు కూడా తలెత్తాయి.

కోట్లతో మంతనాలు

అయితే అనూహ్యంగా జయనాగేశ్వర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం కోట్ల స్వగ్రామమైన కోడుమూరు మండలం లద్దగిరికి వెళ్లడంతో ఈ వివాదంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోట్ల స్వగృహంలో ఇరువురు నేతలు భేటీ అయ్యి మంతనాలు జరిపారు. తనకు ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని.. కర్నూల్ ఎంపీ సీటుకే పోటీ చేస్తానని ఈ సందర్బంగా జయనాగేశ్వర్ రెడ్డికి కోట్ల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ విషయంలో ఏర్పడిన అపోహలు, స్పర్థలు తొలగిపోయాయని..ఇద్దరు నేతలు రాజీకి వచ్చారని కార్యకర్తలు భావిస్తున్నారు.