iDreamPost
android-app
ios-app

రేవంత్ కు హార‌తి ప‌ట్టిన కొండా సురేఖ‌

రేవంత్ కు హార‌తి ప‌ట్టిన కొండా సురేఖ‌

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖ.. రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొద‌ట్లో టీపీసీసీ వర్కింగ్ రేసులో పీసీసీ ఛీప్ రేసులో మహిళా నాయకురాలు కొండా సురేఖ పేరు కూడా వినిపించింది. పార్టీ అధిష్ఠానం కూడా మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

గ‌తంలో కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య‌నాయ‌కురాళ్లు డీ.కె.అరుణ, విజయశాంతిలు బీజేపీలోకి వెళ్లిపోవ‌డంతో వారి స్థానంలో స‌రైన నాయ‌కురాలిని తెర‌పైకి తీసుకురావాల‌ని కాంగ్రెస్ భావిస్తూ వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గానే జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ రాజీనామా చేయ‌డంతో సురేఖ యాక్టివ్ అయ్యారు. దీంతో పీసీసీ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

కొండా సురేఖకు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రిగా పనిచేసిన అనుభవం, మంచి వాక్చాతుర్యం వంటి అనుకూల అంశాలు ఉండ‌డంతో సురేఖ పేరు కూడా పీసీసీ రేసులో వినిపిస్తూ వ‌చ్చింది.

తొలుత- బీసీ మహిళకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఒకదశలో కొండా సురేఖ పేరును కూడా పరిశీనలోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. దీనితో ఆమె కూడా ఈ పదవిపై ఆశలు పెంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చిన కొండా సురేఖ జగన్ మద్దతుగా వైసీపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ ఉప ఎన్నికలో గెలవలేకపోయారు . 2014 ఎన్నికల ముందు తెరాస లో చేరి ఎమ్మెల్యే గా గెలిచారు. కెసిఆర్ తో ఎక్కువ కాలం సఖ్యత కొనసాగించలేక 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు.

తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు త‌ర్వాత చివ‌ర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ ప‌ద‌విని రేవంత్ కు అప్ప‌గించింది. దీంతో పార్టీ సీనియ‌ర్ల‌లో తీవ్ర స్థాయిలో అసంతృప్తులు వ్య‌క్త‌మ‌య్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన తనకు రాష్ట్ర స్థాయిలో పార్టీపరంగా అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టడం వల్ల సీనియర్ నేతల్లో నెలకొన్న అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చేందుకు రేవంత్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళా నాయ‌కురాలు కొండా సురేఖ ఇంటికి రేవంత్ వెళ్లారు. ఇంటికి వ‌స్తున్న రేవంత్ కు గుమ్మం వ‌ద్దే కొండా హార‌తి ప‌ట్టి తిల‌కం దిద్దారు. ఓ మొక్కను ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని కొండా సురేఖ స్వాగతించినట్టేన‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.