iDreamPost
iDreamPost
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెసులో చెలరేగిన ప్రకంపనలు ఏమాత్రం సద్దుమణగకపోగా.. ఇంకా పెరుగుతున్నాయి. ఉప ఎన్నికలో పార్టీకి ఎదురైన ఘోర పరాభవాన్ని ఆసరా చేసుకుని నాయకుల ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు వాటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం టాగూర్ లను ఆయన టార్గెట్ చేస్తున్నారు. దాంతో టాగూర్ కూడా కోమటిరెడ్డి విషయం అధిష్టానం వద్దే తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
ఎంపివి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.
మిగతా పార్టీల కంటే కాంగ్రెసులో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తమ పార్టీలో అంతర్గత స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఎక్కువని పలు సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. దీనివల్ల పార్టీకి కొన్ని సందర్భాల్లో మంచే జరుగుతున్నా.. చాలా సందర్భాల్లో పార్టీయే ఇబ్బందుల్లో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెసులో పరిణామాలు పార్టీనే ఇరకాటంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి చేస్తున్న పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ఇరకాటంలోకి నెడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు నియామక సమయం నుంచీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం టాగూర్ ను టార్గెట్ చేస్తున్న ఎంపీ.. హుజురాబాద్ పరాభవం తర్వాత ఆయనతోపాటు రేవంత్ పై ఆరోపణల దాడి పెంచారు. పీసీసీ అధ్యక్ష పదవిని టాగూర్ అమ్ముకున్నారని గతంలో కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. పార్టీ అధిష్టానం సైతం సీరియస్ అయ్యింది. ఎన్నికకు ఐదు నెలల సమయం లభించినా కనీసం పార్టీ క్యాడర్ ఓట్లు కూడా వేయించుకోలేకపోయారని ఆయన తాజాగా విమర్శించారు. దీనికి రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగూర్ లే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగుకు ముందు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనందున.. ఈటల మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని ఇదే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడి ప్రకారం టీఆరెస్ ను ఓడించేందుకు అలా చేయక తప్పులేదని చెప్పిన ఆయన.. దానికి పూర్తి భిన్నంగా ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో పార్టీ నాయకులు విఫలం అయ్యారని వ్యాఖ్యానించడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.
అధిష్టానానికి ఫిర్యాదు
గతం నుంచి తనపై ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డి విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం టాగూర్ సిద్ధపడుతున్నారు. ఇదే సమయంలో హుజురాబాదులో ప్రచారం జరుగుతున్న సమయంలో కోమటిరెడ్డి దుబాయ్ వెళ్లి క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫోటోలు, చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం వద్ద పెట్టి పంచాయితీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మరో కోమటిరెడ్డి తీరుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచారంలో పాల్గొనకుండా వేరే దేశంలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేసిన వారికి ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు. మొత్తం మీద హుజురాబాద్ పంచాయితీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు. అసలే ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు నాయకుల కుమ్ములాటలతో మరింత డీలా పడిపోతున్నారు.