iDreamPost
android-app
ios-app

రమణమ్మ టీమ్! పంచాయితీ ఎన్నికల్లో మహిళారాజ్యం!

రమణమ్మ టీమ్! పంచాయితీ ఎన్నికల్లో మహిళారాజ్యం!

అమ్మ లాలన, ఆకాశం లాంటి ఆదరువు, అవని కి మించిన ఓర్పు, ఆది పరశక్తి ఆగ్రహం కలబోసిన ఆ 11 మంది మహిళలు ఒక్కటయ్యారు. తమను ఎగతాళి చేసిన నోళ్లను తమ విజయంతో ముయిస్తే, గేలి చేసిన నవ్వులను తమ ఐకమత్యంతో కట్టి పడేసారు. పంచాయతీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా కొమరవోలు పంచాయతీ ప్రత్యేకంగా నిలిచింది. పురుషులతో పోటీ పడి మరీ 11 మంది మహిళా టీమ్ పంచాయతీలోని అన్ని వార్డులలో విజయాల సిక్స్లు నమోదు చేశారు. ప్రత్యర్థులకు చెమటలు పట్టించేలా ఓట్ల వికెట్లను రాల్చారు.

అందరూ మహిళలే!

కొమరవోలు పంచాయతీ చోడవరం నియోజకవర్గ పరిధిలో ఉంది. విశాఖ ఏజెన్సీలో నర్సీపట్నానికి దగ్గరగా ఉంటుంది. గ్రామ జనాభాలో పురుషులు 11 04 మంది అయితే, మహిళలు 996 మంది ఉన్నారు. గ్రామంలో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నా అందరూ మహిళలే నెగ్గడం విశేషం.

కొమరవోలు పంచాయితీ రిజర్వేషన్ జనరల్ అయింది. దీంతో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఏర్పడింది. మొదట గ్రామ మాజీ సర్పంచ్ చిట్టెమ్మ నాయుడు భార్య రమణమ్మ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె తనతో పాటు వార్డు సభ్యులు అంతా మహిళలే ఉంటే బాగుంటుంది అని ఆలోచించారు. మొత్తం 11 వార్డులకు గాను 10 మంది మహిళలు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆరో వార్డు మెంబర్గా ఎవరూ లేకపోవడంతో సత్యవతి అనే మహిళ వద్దకు మిగిలినవారంతా వెళ్ళి ఆమెను ఒప్పించారు. మహిళలనే ఉంటున్నామని, ఆరో వార్డు సత్యవతి పోటీలో ఉంటే అంతా బాగుంటుందని ఒప్పించడంతో ఆమె కూడా రంగంలోకి దిగారు.

పేరంటానికి వెళ్తున్నావా అంటూ ఎగతాళి…

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతా కలిసి ఒక జట్టు గానే అన్ని వార్డులకు ప్రచారానికి వెళ్లేవారు. ఎన్నికలకు ముందే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. దీంతో వార్డ్ మెంబర్ ల విషయంలో పోటీ తప్పలేదు. ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఓట్లు అడుగుతున్నప్పుడు రకరకాల మాటలు, కామెంట్లో తమ చెవి వరకు వచ్చేవని, అయితే కచ్చితంగా గెలవాలన్న కసితో తాము అలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని మహిళలు చెబుతున్నారు. అయితే మొత్తం అందరూ గెలుస్తారని మొదటినుంచి అనుకోలేదని, కొన్ని వార్డుల్లో బలంగా ఉన్న చోట్ల గెలుస్తామని భావించామని చెప్పారు. ముఖ్యంగా వార్డుల్లో పురుషులతో పోటీ ఉండటంతో మొదట భయం వేసింది అని, అయితే ఓటర్లు వద్దకు వెళ్లి తాము గెలిస్తే ఏం చేస్తావ్ అన్నది స్పష్టంగా చెప్పడంతో వారు కూడా కన్విన్స్ అయ్యారు అని చెప్పుకొచ్చారు.

20 ఏళ్ల కిందట గీతమ్మ

కొమరోలు పంచాయతీ కు ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ళ క్రిందట గీతమ్మ అనే మహిళా సర్పంచ్ గా పనిచేశారు. అది కూడా మహిళలకు రిజర్వేషన్ రావడంతో ఆమెనూ అంతా కలిసి నిలబెట్టారు. ఇక వార్డు మెంబర్లు సైతం మహిళలు తక్కువగానే ఎన్నికవుతూ వచ్చారు.

అయితే ఇప్పుడు 11 మంది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క నేపథ్యం నుంచి వచ్చిన వారు ఎన్నిక కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోనే పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. 11 మందిలో ఇద్దరు పీజీలు చేసిన వారు ఉంటే, ముగ్గురు చదువు రాని వారు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలిచిన వారి స్థానంలో వారి అధికారాలనూ కుటుంబ సభ్యులు రాయించడం జరుగుతూ ఉంటుందని, పంచాయితీలో అలాంటి పరిస్థితి రాకూడదని ముందుగానే నిర్ణయించుకున్నామని గెలిచిన మహిళలు చెబుతున్నారు. పంచాయతీ ను గెలవడం తోనే సరిపోలేదని, తమ మార్కు పాలనతో మహిళలంటే ఎంత బాగా పాలిస్తారు అన్నది చూపిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.