iDreamPost
android-app
ios-app

కోడెల వారసుల రాజకీయ జాడెక్కడ?

  • Published May 02, 2020 | 3:13 PM Updated Updated May 02, 2020 | 3:13 PM
కోడెల వారసుల రాజకీయ జాడెక్కడ?

నరసరావుపేట , ఎందరో రాజకీయ ఉద్దండులు ఇక్కడ పుట్టి ఓనమాలు దిద్ది రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు . వారిలో కోడెల కూడా ఒకరు . టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి తన తుది ఘడియల వరకూ టీడీపీ పార్టీతో నిలబడ్డ అతి కొద్ది మంది సీనియర్స్ లో కోడెల ఒకరు . టీడీపీలో బాబు కాకపోతే లేదా తర్వాత నాయకత్వం వహించేదెవరూ అన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ అందరి కళ్ళు కోడెల వైపే చూసేవంటే అతిశయోక్తి కాదు .టీడీపీ పార్టీలో , టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ భాద్యతలు , ఉన్నత పదవులు అధిష్టించిన కోడెల చరమాంకంలో విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి తొలి స్పీకర్ గా పనిచేశారు .

2019 లో టీడీపీ అధికారానికి దూరమయ్యాక కోడెల తనయుడు శివరాం , కూతుర్ల పై పలు ఆర్ధిక ఆరోపణలు రావటం , అసెంబ్లీ ఫర్నిచర్ కేసులతో కొంతకాలం సతమతమైన కోడెల గత సెప్టెంబర్లో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత అప్పటి వరకూ అజ్ఞాతంలో గడిపిన కోడెల తనయుడు శివరాం అజ్ఞాతం వీడి అంతిమయాత్ర మధ్యలో వచ్చి పాల్గొన్నాడు .

ఆ రోజు చంద్రబాబు మాట్లాడుతూ కోడెలది ఆత్మహత్య కాదని రాజకీయ హత్య అని ఆరోపిస్తూ కోడెల వారసులకు తాను అండగా ఉంటానని , పార్టీ తరుపున సరైన ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేస్తానని వాగ్ధానం చేశారు . కోడెల మరణానికి ముందు ఆర్ధిక ఆరోపణలపై , కోడెల తనయుని ఫర్నిచర్ దొంగతనం పై మాట్లాడుతూ పార్టీ పరువు తీశారని వ్యాఖ్యానించిన వర్ల రామయ్య , మరికొందరు నేతలు కోడెల మరణం తరువాత మాట మార్చి వైసీపీ మీద ఆరోపణలు చేసి కోడెల కుటుంబం వెనుక తామంతా ఉన్నామని వ్యాఖ్యానించారు .

కోడెల బతికి ఉండగా తన పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తానని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వని బాబు , గురజాల నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల పరామర్శ యాత్రలో సైతం కోడెల స్వయంగా వస్తానని కోరినా రానివ్వలేదన్న వార్తలు వినవచ్చాయి . కోడెల అనారోగ్యంతో గుంటూరు హాస్పిటల్లో ఉన్నా చంద్రబాబు పరామర్శించలేదు.అయితే కోడెల మరణించిన తర్వాత మాత్రం భౌతిక కాయాన్ని నేరుగా నరసరావుపేట తీసుకురాకుండా తనకు వర్గ పరంగా పట్టున్న కృష్ణా జిల్లా మీదుగా శవయాత్ర చేస్తూ తీసుకొచ్చి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు . ఆ సందర్భంగా కోడెల రాజకీయ వారసుడిగా శివరాంకి గుర్తింపునిస్తూ తన భవిష్యత్ తాను చూసుకొంటానని బాబు ప్రజాసమక్షంలో హామీ ఇచ్చారు .

తిరిగి చూస్తే కోడెల వారసులు టీడీపీ కార్యక్రమాల్లోకనపడటం లేదు,కోడెల మరణంతో ఆయన కోడు శివరామ కృష్ణను సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా ప్రకటిస్తారు అని భావించినా ఇప్పటి వరకు చంద్రబాబు వైపు నుంచి అలాంటి ప్రకటన రాలేదు.మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన డాక్టర్ అరవింద బాబు ఎన్నికల తరువాత రాజకీయంగా క్రియాశీలకంగా లేదు. కోడెల ఐదుసార్లు గెలిచిన నియోజకవర్గం కావటం వలన సత్తెనపల్లి కాకుంటే నరసరావుపేట ఇంచార్జ్ గానైనా కోడెల కొడుకుకు ఇంచార్జ్ పదవి ఇస్తారని భావించినా అది కూడా జరగలేదు.

కోడెలకి మంచి పట్టున్న నరసరావుపేటని కానీ , గత రెండు సార్లు పోటీ చేసిన సత్తెనపల్లిని కానీ కోడెల తనయుడికి వారసుడిగా ఇంచార్జ్ భాద్యతలు ఎందుకు అప్పచెప్పలేదన్న అంశం మీద టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతుంది. తన కుమారుడి లోకేషుని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కూడా చేసిన చంద్రబాబు , కోడెల వారసులకు మాత్రం ఎందుకు బాధ్యతలు ఇవ్వటం లేదో స్థానిక టీడీపీ కార్యకర్తలకు అర్ధం కావటం లేదు. ఒక దశలో కోడెల కూతురికి సత్తెనపల్లి ,కొడుక్కు నరసరావుపేట ఇంచార్జ్ భాద్యతలు అప్పచెప్తారని ప్రచారం జరగటం గమనార్హం.

కోడెల రాజకీయ జీవిత చరమాంకంలో వచ్చిన ఆరోపణల సెగ తనకు , పార్టీకి , భావి వారసుడిగా ముందుకు తెస్తున్న లోకేష్ కి తగలకుండా జాగ్రత్త పడుతున్నాడా ? . లేక తన రాజకీయ జీవితం మొత్తంలో ఎవరినైనా వాడుకొని ఎదిగిన తర్వాత వారిని గాలికి వదిలేస్తాడు అని బాబుపై ఉన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చుకొంటూ కోడెల వారసుల్ని కూడా వదిలించుకొనే ప్రయత్నం చేస్తున్నారా ? .

నేడు కోడెల జయంతి,లాక్ డౌన్ వలన నాటి స్థాయిలో ఆయన పుట్టిన రోజు వేడులకు నిర్వహించలేకపోవచ్చు కానీ టీడీపీ నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.