Idream media
Idream media
ఆయనో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ.. మంత్రి వస్తున్నారంటే ముందుగా కనిపించేది ఆయన సెక్యూరిటీ బలగం. ఏ కార్యక్రమానికి అయినా.. కిషన్ రెడ్డి వెళ్తే ముందుగా కాన్వాయ్ లోని సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగి.. కిషన్‌రెడ్డిని రావొచ్చు అన్నట్లుగా డోరు తీస్తారు. ఏ మంత్రి కైనా ఇది సాధారణంగా జరిగేదే. కానీ.. ఓ విచిత్ర సన్నివేశానికి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వేదికైంది.
రెండు రోజులుగా పర్యటనలు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌తో భేటీ అనంతరం.. తెలంగాణలోని కరోనా పరిస్థితులను సమీక్షించి.. కేంద్రానికి తెలియజేసే బాధ్యతలను బీజేపీకి చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి కేంద్రం అప్పగించింది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బృందం ఇటీవల హైదరాబాద్ లో పర్యటించింది. ఆ బృందం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి కి ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిశీలించిన కేంద్రం వైరస్ పెరిగేందుకు కారణాలను, బాధితులకు చికిత్స అందుతున్న తీరును పరిశీలించాలని చెప్పడంతో ఈ నెల 11 నుంచి కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. అక్కడ బాధితులకు అందుతున్న సేవలను తెలుసుకుంటున్నారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్ లు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.
గాంధీ ఆస్ప్రతికి వచ్చినప్పుడు…
తనిఖీల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం గాంధీ ఆస్ప్రతికి వచ్చారు. ఓపీ బ్లాక్ వద్ద కారు దిగగానే.. భద్రతా సిబ్బందితో మాట్లాడారు. “మీరెవరూ ఆస్పత్రి లోపలకు రాకండి. కారులోనే కూర్చోండి. నేనొక్కడినే ఆస్పత్రి లోనికి వెళ్తా ” అన్నారు. ఆయన మాటకు చెప్పేదేమీ లేక సెక్యూరిటీ సిబ్బంది కారులోనే కూర్చున్నారు. ఆయన మాత్రం ఒక్కడే లోపలకు వెళ్లి దాదాపు గంట పాటు గాంధీ ఆస్పత్రిలో కలియ తిరిగారు. ఓపీ, కరోనా వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న వారి వివరాలను, పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఒక్కడే ఆస్పత్రిలో లోపలకు రావడంతో వైద్యులు, సిబ్బంది అవాక్కయ్యారు. కారణం ఏంటా అని ఆరా తీయగా.. ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధుల భద్రతా సిబ్బంది, గన్ మన్ లు కరోనా బారిన పడ్డారు. వారి నుంచి ప్రజా ప్రతినిధులకు కూడా వైరస్ సోకిన ఘటనలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా వారిని కారులోనే ఉండమని మంత్రి ఒక్కరే ఆస్పత్రిలోని పరిస్థితులను పరిశీలించి వచ్చారు. మొత్తమ్మీద కరోనా తెచ్చిన మార్పులో ఇదీ ఒకటని గాంధీ ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది.