iDreamPost
iDreamPost
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్నికల గురించిన చర్చ మొదలైంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2023 కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజారిటీ గెలిచారు. కాంగ్రెస్ పార్టీలోని మహామహులను ఓడించారు. కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలమైనా.. ముగ్గురు లీడర్లు మాత్రం ప్రధానంగా లాభపడ్డారు. ‘చెల్లని రూపాయి’ అని టీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ముందు ఓడిపోయినా తర్వాత రాజకీయంగా నిలదొక్కుకున్నారు. పెద్ద పదవులు చేపట్టారు.
బలమైన వాయిస్.. రేవంత్..
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మొన్ననే పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ రెండున్నరేళ్ల కిందటి పరిస్థితి వేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ లో, అంతకుముందు టీడీపీలో వాయిస్ ఎక్కువగా వినిపిస్తున్న రేవంత్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోతే.. రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ అప్పట్లో ప్రకటించారు. ఓడిపోయారు కూడా. ‘సన్యాసం’ విషయాన్ని టీఆర్ఎస్ లైట్ తీసుకుంది. దీంతో తర్వాతి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Also Read : తాజా మాజీ మంత్రులకు మరో చాన్స్!
మాజీ ఎమ్మెల్యే టు కేంద్ర మంత్రి
గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన కిషన్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో బీజేపీ కేవలం గోషామహల్ సీటు మాత్రమే దక్కించుకుంది. దీంతో కాషాయ పార్టీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. ‘సారు కారు పదహారు’ అన్న టీఆర్ఎస్ వ్యూహాన్ని దెబ్బకొట్టి ఏకంగా నాలుగు స్థానాల్లో గెలిచింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. వెంటనే కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ప్రమోషన్ పొందారు. అప్పుడు ఓడిపోవడం ఇప్పడు కిషన్ రెడ్డికి మంచిదైంది. మాజీ ఎమ్మెల్యే స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా మారారు.
బీజేపీ స్టేట్ చీఫ్.. ఒకప్పటి కార్పొరేటర్
ఆర్ఎస్ఎస్ మూలాలున్న బండి సంజయ్.. గతంలో కరీంనగర్ నగర పాలక సంస్థ కార్పొరేటర్ గా పలుసార్లు గెలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆరు నెలలకే అంతా మారిపోయింది. కరీంనగర్ లో ఉన్న పట్టు.. రెండు సార్లు ఓడిపోయిన సింపతీతో ఎంపీగా గెలిచారు. బలమైన వాయిస్ వినిపించారు. దీంతో బీజేపీ స్టేట్ చీఫ్ గా నియమితులయ్యారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావును గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు.
Also Read : బీజేపీకి దీదీ టెక్నికల్ షాక్