iDreamPost
android-app
ios-app

ఓటమే కిషన్‌రెడ్డికి వరంగా మారింది..

ఓటమే కిషన్‌రెడ్డికి వరంగా మారింది..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గంగాపురం కిషన్‌రెడ్డి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి.. ఎంపీగా గెలిచిన ఆయన ఇప్పుడు ఏకంగా కేబినెట్‌ మంత్రి అయిపోయారు. సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంతిగ్రా ప్రధాని మోదీ తాజా కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు.. తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఐడ్రీమ్‌పోస్ట్ ఫోకస్‌..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో స్వామిరెడ్డి, ఆండాళమ్మల దంపతులకు 1964 మే 15న కిషన్‌ రెడ్డి జన్మించారు. గ్రామంలో జన్మించినప్పటికీ చిన్ననాటి నుంచే సంఘ కార్యకలాపాలపై ఆసక్తి కనబరిచేవారు. కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కృషి, దీక్ష, పట్టుదల, నేర్పరితనం, ఓర్పు, స్పష్టమైన వైఖరితో ఉన్న వ్యక్తిత్వమే కిషన్‌రెడ్డిని ఆ స్థాయికి తీసుకు వెళ్లింది.

లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్‌ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు. 1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత సామాన్య కార్యకర్తగా చేరారు. పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించేవారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాసం ఉంటూనే పార్టీ కార్యక్రమాలతోపాటు, చదువునూ కొనసాగించారు కిషన్ రెడ్డి. ఇబ్రహింపట్నంలో ఉన్నత పాఠశాల.. పాతపట్నంలో ఇంటర్‌.. కేంద్ర ప్రభుత్వం సంస్థ సీఐటీడీలో టూల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.

బీజేపీ అధ్యక్షుడిగా సత్తా

2002 నుంచి 2005 వరకు బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సందర్భంగా యువతకు బాగా దగ్గరయ్యారు. యువమోర్చా నాయకుడిగా గుర్తింపు పొంది.. సీనియర్ల కంటే పార్టీలో కిషన్‌రెడ్డి పేరు పొందారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షుడిగా పని చేశారు. అంతకు ముందే 1999లో కార్వాన్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో పూర్వ హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఎమ్మెల్యేగా ఓటమి

2009లో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం రద్దుచేసి అంబర్‌పేట నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంబర్‌పేట అంటే కిషన్‌రెడ్డి.. కిషన్‌రెడ్డి అంటే అంబర్‌పేటగా ముద్ర పడింది. అయినప్పటికీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన ఓటమితో స్థానికులు కొంత మంది కన్నీళ్లుకూడా పెట్టుకున్నారు.

ఓటమి నుంచి కేంద్ర మంత్రిగా

అయితే.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడమే కిషన్‌రెడ్డికి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు పార్టీ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సింపథీతో పాటు ఆ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు ఉండడం కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది. దీంతో 62 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మే 30న మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

మంత్రివర్గ విస్తరణలో…

ప్రధాని చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి రికార్డులకెక్కారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వారిలో కిషన్‌రెడ్డి రెండో వారు. బండారు దత్తాత్రేయ కార్మిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. కిషన్‌రెడ్డి కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అంబర్‌పేట నియోజకవర్గంలోను, బర్కత్‌పురలోని నగర కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఆ రెండుడు వ్యూహాలతో ముందుకెళ్తా : కిష‌న్ రెడ్డి

కేబినెట్‌ విస్తరణలో భాగంగా నరేంద్ర మోదీ బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి పదోన్నతి కల్పించారు. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి ఈ సారి కేబినెట్‌ హోదా కల్పించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను” అని తెలిపారు. “నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇందుకుగాను వారికి కృతజ్ఞుడనై ఉంటాను. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదాలు తేలియజేస్తున్నాను’’ అన్నారు కిషన్‌ రెడ్డి.

“నవభారత నిర్మాణం కోసం, నరేంద్రమోదీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి. నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు కిషన్‌ రెడ్డి.