Idream media
Idream media
ఇరు రాష్ట్రాల మధ్య మరోమారు మొదలైన జల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఇరు రాష్ట్రాల వాదన ఎలా ఉన్నా.. అంతిమంగా విలువైన జలాలు వృథాగా పోతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తమ హక్కు అని తెలంగాణ చెబుతున్నా.. వృథాగా సముద్రంలో కలుస్తున్న నీరు తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతోంది. లాభ నష్టాలు ఎలా ఉన్నా.. జల వివాదంపై తెలంగాణలోని ప్రతిపక్షాలు తమదైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
ఎన్నికల కోసమేనట..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం కేసీఆర్ చేస్తారంటూ ఆరోపించారు కిషన్ రెడి. త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేసీఆర్.. జలవివాదాన్ని తెరపైకి తెచ్చారనేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయి. ఆస్తులు, దావత్‌లు చేసుకున్న వారు.. జల వివాదాలు పరిష్కరించుకోలేరా..? అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జల వివాదంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్రానిది కాదనేలా కిషన్ రెడ్డి మాట్లాడడం విశేషం. ఆయన ప్రకటన.. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదనేలా ఉంది.
కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదట..
పీసీసీ నూతన అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నిన్నటి పార్టీ అంటూ.. దానికి భవిష్యత్ లేదని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.
Also Read : నా ప్రస్థానాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు : కెసిఆర్