ఏప్రిల్ 17న అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం జరుపుతారు. కానీ వ్యవసాయానికి పెట్టింది పేరైన భారతదేశంలో మనకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినోత్సవాన్ని డిసెంబర్ 23న కిసాన్ దివస్ గా ప్రకటించారు. జమీందారీ చట్టం రద్దు అయినా , కౌలుదారీ చట్టం వచ్చినా, కొంతమంది నాయకుల ఆలోచన నుండి భూసంస్కరణలు వచ్చినా , పేదలకు భూముల పంపిణీ జరిగినా, రైతులను వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విడిపించి వారికి బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టేలా చేసినా చరణ్‌సింగ్ చేపట్టిన రైతు ఉద్యమాల ఫలితంగానే అని చెప్పడంలో సందేహం లేదు.
చరణ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని నూర్పూర్ గ్రామంలో 1902 డిసెంబర్ 23న జన్మించారు, రైతు నాయకుడిగా ప్రాచుర్యం పొందిన చరణ్ సింగ్ 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. న్యాయ శాస్త్రంలో కూడా శిక్షణ పొందిన చరణ్ సింగ్ 1929లో మీరట్ వచ్చేవరకూ ఘజియాబాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనేకసార్లు జైలుశిక్ష అనుభవించారు.
ఉత్తరప్రదేశ్ చాప్రోలి నుండి తొలిసారిగా 1937లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా 1946,1952,1962,1967 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి తిరిగి విజయం సాధించారు. 1946లో గోవింద్ భల్లబ పంత్ మంత్రివర్గంలో పార్లమెంటరీ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించిన చరణ సింగ్ ఆ తరువాత న్యాయ సమాచార శాఖలకు మంత్రి అయ్యారు . అలాగే రెవెన్యూ , వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలక శాఖలకు మంత్రిగా సేవలు అందించారు. 1952లో సంపూర్ణానంద మంత్రి వర్గంలో రెవిన్యూ , వ్యవసాయ శాఖ మంత్రిగా , 1960లో చంద్రబాను గుప్త మంత్రి వర్గంలో హోం , వ్యవసాయ శాఖలను నిర్వహించారు. 1963లో సుచేతా కృపాలిని హయాంలో వ్యవసాయ , అటవీశాఖ, స్థానికపాలనా శాఖలను నిర్వహించారు.
నెహ్రూ ఆర్ధిక విధానలతో ఏకీభవించని చరణ్ సింగ్ 1967 చంద్రబాను గుప్త హయాంలో కాంగ్రెస్ ను వదిలి ప్రతిపక్షమైన సమ్యుక్త విదాయక్ దళ్ కు నేతృత్వం వహించారు. ఆ తరువాత భారతీయ క్రాంతి దళ్ ను స్థాపించి 1968 వరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. స్వాతంత్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో తొలి సారి కాంగ్రెసేతర పార్టీని అధికారంలోకి తీస్కుని వచ్చిన ఘనత చరణ్ సింగ్ కే దక్కుంతుంది. కాంగ్రెస్ చీలిక తరువాత 1970 ఫిబ్రవరిలో రెండో సారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చరణ్ సింగ్ భూ సంస్కరణలకు చొరవ తీసుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో రుణ విమోచన చట్టం . ల్యాండ్ హోల్డింగ్ చట్టాన్ని ప్రవేశ పెట్టారు.
1974 చివరిలో ఇందిరా గాంధీ పాలనను వ్యతిరేకిస్తు స్వతంత్ర పార్టీ , ఉత్కల్ కాంగ్రేస్, సోషలిస్ట్ పార్టీలు సంయుక్తంగా భారతీయ లోక్ దళ్ ను స్థాపించారు. ఈ పార్టీ 1974 అసెంబ్లీ ఎన్నికల్లో 106 స్థానాలను గెలుచుకుంది. 1977 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చరణ్ సింగ్ 1977 లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికై మురార్జీ దేశాయి నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో హోంమంత్రిగా సేవలు అందించారు. ఆ తరువాత మొరార్జీతో వచ్చిన అభిప్రాయభేదాలవలన తన సహచరుడు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్న రాజ్ నారాయణతో కలిసి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాతో జనతా ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం జయప్రకాష్ నారాయణ , మహారాష్ట్ర జనతా నాయకుడు ఎస్.ఎం జోషి లాంటి వారు చూపిన చొరవ వలన 1979 జనవరి 24న ఉప ప్రధానిగా చరణ్ సింగ్ నియమితులవ్వడంతో ముగిసింది.
మొరార్జీ దేశాయితో చరణ్ సింగ్ కు గల అభిప్రాయ భేదాలు ముఖ్యంగా సభ్యుల ఉభయపదవులపై , ఆర్.ఎస్.ఎస్ విషయంలో విభేధాలు కొనసాగి పార్లమెంటు సభ్యుల్లో చరణ్ సింగ్ అనుకూల వర్గం వేరుపడి ప్రధానిగా ఉన్న మొరార్జీ రాజీనామాకు దారితీసాయి. ఈ పరిణామాలతో మొరార్జీ ఆపధర్మ ప్రభుత్వ స్థానంలో ప్రభుత్వ స్థాపనకు రాష్ట్రపతి సంజీవ రెడ్డి ప్రతిపక్షనాయకుడైన చావన్ ను 1979 జులై 18న ఆహ్వానించారు. అయితే చావన్ ఆ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో 1979 జులై 28న చరణ సింగ్ భారత దేశానికి 5వ ప్రధానిగా భాధ్యతలు శ్వీకరించారు. చరణ్ ప్రభుత్వానికి వెలుపలనుండి తాము మద్దతు ఇస్తాం అని కాంగ్రెస్ (ఐ) నాయకులు హామీ ఇచ్చారు. అయితే 1979 ఆగస్టు 20న ఇందిరాగాంధి తమ మద్దతును ఉపసంహరించుకోవడం మూలాన చరణ్ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. పార్లమెంటు రద్దు చేసి కొత్త ఎన్నికలు జరపాలని ఆయన రాష్ట్రపతిని అభ్యర్ధించి , ఎన్నికలు జరిగే వరకు ఆపధర్మ ప్రభుత్వాన్ని నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి చరణ్ సింగ్ తన సహచరుడు రాజ్ నారాయణ్ తో కలిసి లోక్ దళ్ పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధి ఘన విజయం సాధించగా , లోక్ దళ్ పార్టీ లోక్ సభలో రెండవ పెద్ద పార్టీగా అవతరించింది. అప్పటికి దేశంలో పార్లమెంట్ సమావేశానికి ఒక్కసారి కూడా హాజరు కాని తొలి కేంద్ర ప్రభుత్వం చరణ్ సింగ్ ప్రభుత్వమే.
నిరాడంబర జీవితాన్ని గడిపిన చరణ్ సింగ్ తన ఖాళీ సమయాన్ని అధ్యయన రచనలకు ఎక్కువ వినియోగించేవారు. జమీందారి రద్దు, సహకార వ్యవసాయ నిశిత పరిశీలన , భారత దేశ దారిద్ర్య నివారణ రైతు స్వామ్యం , పనివారికే భూమి వంటి అంశాలపై అనేక రచనలు చేశారు. చరణ్‌సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29న మరణించారు. డిల్లీ లో ఆయన స్మారకంగా కిసాన్ ఘాట్ ను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.