iDreamPost
iDreamPost
జాతీయ రాజకీయాల్లో మరోసారి జమిలీ ఎన్నికల చర్చ మొదలైంది. ఖర్చు, శ్రమను నియంత్రించే జమిలీ ఎన్నికల విధానం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పార్లమెంటులో వెల్లడించడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జమిలీ ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ నినాదమైన వన్ నేషన్- వన్ ఇండియా నినాదంలో భాగంగా దీన్ని చర్చకు తీసుకొచ్చారు. తర్వాత కొన్నాళ్లు ఈ అంశం మరుగున పడినా కేంద్రమంత్రి తాజా ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా ముందుకెళుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఎప్పటిలోగా తుది నిర్ణయం తీసుకుంటారు.. ఎప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్తారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రతిపక్షాల్లో మాత్రం అంత సానుకూలత వ్యక్తం కావడంలేదు.
కేంద్ర పరిశీలనలో లా కమిషన్ సిఫార్సులు
పలు రాజ్యాంగ సంస్థల సూచనల మేరకు దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు లోకసభలో వెల్లడించారు. ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ వివరాలు చెప్పారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వాలపై ఖర్చుల రూపంలో తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే చాలా వరకు ఖర్చులు తగ్గుతాయని వివరించారు. 2014-19 మధ్య వివిధ ఎన్నికలకు రూ.5,814 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. తరచూ ఎన్నికల వల్ల అనవసర ఖర్చులే కాకుండా ప్రజా జీవనానికి, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అన్ని ఎన్నికలు ఒకసారి జరిపించేస్తే.. మిగిలిన కాలమంతా పాలన, అభివృద్ధిపై దృష్టి సారించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. దీనిపై లా కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. గతంలో పార్లమెంటరీ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఆ సిఫార్సులపై లా కమిషన్ సూచనలు కోరామన్నారు. ఆ మేరకు వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన 244, 255 నివేదికల్లో జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేసిందని.. అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
చాప కింద నీరులా కేంద్రం చర్యలు
కేంద్రమంత్రి ప్రకటనకు తోడు కేంద్రం తీసుకుంటున్న చర్యలు జమిలియా దిశగా అడుగులు వేస్తున్న భావన కల్పిస్తున్నాయి. దేశంలో నకిలీ ఓట్ల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసమే ఆధార్-ఓటర్ కార్డుల అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. ఈసీఎంకుడా త్వరలోనే దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనివల్ల దొంగ ఓట్లను అడ్డుకోవడంతో పాటు ఒకే వ్యక్తి పలు ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఓటు వేయకుండా అడ్డుకట్ట వేయవచ్చునని అంటున్నారు. జమిలీ ఎన్నికలు వీలైతే 2022 చివరిలో లేదా 2023లో జరపాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే విపక్ష పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. యూపీఏ తోపాటు తృణమూల్, ఎన్సీపీ తదితర పార్టీలు దీనికి అంత సుముఖంగా లేవు. ఇక ప్రాంతీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల జాతీయ అంశాలు తప్ప ప్రాంతీయ అంశాలు అంతగా చర్చకు రావు. ఇది రాజకీయంగా ప్రాంతీయ పార్టీలకు నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయం ఉంది.