iDreamPost
android-app
ios-app

చివరి బాల్ నుంచి ఓపెనింగ్ బ్యాటింగుకు!!!

చివరి బాల్ నుంచి ఓపెనింగ్ బ్యాటింగుకు!!!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్టు ఆ దిశగా అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ త్వరలోనే 10 జనపథ్ సమాయత్తమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఏర్పాటైన వార్ రూమ్ లో ఏపీ పీసీసీ పదవికి మాజీ కేంద్ర మంత్రులు చింతా మోహన్, పల్లంరాజు ,రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన చేసిన సాకే శైలజానాధ్ పేర్లను పరిశీలించారు. కానీ రెండేళ్ల క్రితం రాహుల్ సమక్షంలో సొంత గూటికి చేరుకున్నప్పటికి, క్రియాశీలక రాజకీయాల నుండి దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి పేరు రావడం చర్చనీయాంశమైంది.అయినా కూడా కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పీసీసీ పదవి తీసుకునేందుకు అంత సుముఖంగా లేరని ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ ఒత్తిడి తెచ్చి ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎట్టి ప‌రిస్థితుల్లో రాష్ట్ర విభ‌జ‌న అడ్డుకుంటానంటూ లాస్ట్ బాల్‌తో సిక్స్ కొడ‌తానంటూ చెప్పుకొచ్చారు. కానీ, రాష్ట్ర విభ‌జ‌న బిల్లు పార్ల‌మెంట్‌లో ఆమోదం పొంద‌గానే త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ,కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల ఓటమి, రాష్ట్ర విభజన త‌రువాత చాలా కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా వాణిజ్య సముదాయంగా మార్చేశారు.

అయితే తిరిగి రెండేళ్ల క్రితం ఆయ‌న రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోనే చేరారు. ఆ స‌మ‌యంలో పార్టీ వీడిన వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొస్తాన‌ని చెప్పుకొచ్చారు. త‌రువాత రాహుల్ ఏపీలో చేసిన ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొని ఆయ‌న ప్ర‌సంగాల‌ను తెలుగులో అనువ‌దించారు. కానీ, స‌డ‌న్‌గా క్రియాశీలక రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యం లోనూ తరువాత ఎక్క‌డా క‌నిపించ లేదు. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కాంగ్రెస్ 2019 లో ఓటమి చెందడంతో, ఈయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు రావడంతో వాటిని నిరాధారమైన వార్తలంటూ కొట్టివేశారు ,రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ గా రాజీనామా చేసి ఆ పదవిని సోనియా చేపట్టిన తర్వాత పీసీసీ చీఫ్‌గా బాధ్య‌తుల స్వీక‌రించాలంటూ వ‌ర్త‌మానం అందిందని మీడియాలో వార్తలు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.

జగన్ ను ఎదుర్కొనే శక్తి ఉందా?

గత ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్ధకంగా ఉన్న కాంగ్రెస్ సారధిగా ఎదుర్కోగలరా అనే ప్రశ్న అర్ధమవుతుంది. ఐదేండ్ల పాటూ పిసీసీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు పీసీపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. త‌న తండ్రి హయాం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కుటుంబంగా న‌ల్లారి ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించినా రాజ‌కీయంగా సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవటం కిర‌ణ్‌కు క‌త్తి మీద సామే. కిర‌ణ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ పైన కేసులు, అరెస్ట్ జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. కాంగ్రెస్‌లో నాటి నేత‌లు ఎవ‌రూ ఇప్పుడు కిర‌ణ్‌తో లేరు. కేడ‌ర్ సైతం చాలా ప్రాంతాల్లో వైసీపీ,టీడీపీ పార్టీల్లోలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ పైచేయిగా ఉన్న ఏపీ రాజ‌కీయాల్లో పీసీపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించటానికి కిర‌ణ్ ముందుకొస్తారా అంటే అది అనుమానంగానే క‌నిపిస్తోంది.