iDreamPost
android-app
ios-app

టీడీపీని వెంటాడుతున్న అమరావతి పాపం

  • Published Jul 05, 2021 | 2:52 PM Updated Updated Jul 05, 2021 | 2:52 PM
టీడీపీని వెంటాడుతున్న అమరావతి పాపం

రాజధాని ముసుగులో తమ వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు, రియల్టర్లకు మేలు చేసేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అసైన్డ్ భూముల అమ్మకాలకు తెర తీసిన జీవో 41 అప్పటి మంత్రులు, వారు చెప్పినట్టల్లా ఆడిన ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే రాజధాని భూ కుంభకోణాలపై సీఐడీ విచారణ జరుగుతుండగా.. మరోవైపు కోర్టుల్లోనూ పలు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఇచ్చిన స్టేట్మెంట్.. దానికి తోడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిర్గతపర్చిన వీడియో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. జీవో 41 సాయంతో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు అమ్ముకునేల చేసిన బాగోతం, తుళ్లూరు రెవెన్యూ రికార్డులు మాయం చేసి భూముల హద్దులు కూడా లేకుండా చేసిన దందాలను అవి బట్టబయలు చేశాయి.

దళితులకు మేలు పేరుతో మోసం

అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. ఏ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు చేపట్టాలి.. ఎన్ని భూములు సేకరించాలి.. పరిహారం ఖరారు వంటి నిర్ణయాలకు ముందే 1940 ప్రాంతాల్లో దళితులకు ఇచ్చిన సుమారు నాలుగు వేల ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకు స్వాధీనం చేసుకొని ప్రభుత్వం నుంచి ఎక్కువ పరిహారం పొందాలని అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. అప్పటి మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ వ్యవహారాలను దగ్గరుండి నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ మంత్రిగా, సీఆర్డీఏ చైర్మన్ గా ఉన్న నారాయణ తుళ్లూరు రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించి గుంటూరు కలెక్టరేట్లో పెట్టారు. దానితోపాటు తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో దళితుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి (భూమిపుత్ర) ద్వారా కథ నడిపించారు. 

Also Read : వైఎస్‌ని తిడుతున్నారంటూ జేసీ ఆవేదన..!

అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిషిద్ధం. వాటిని అనుభవించడమే తప్ప లబ్ధిదారులు అమ్ముకోవడానికి లేదు. కానీ వాటిపై కన్నేసిన టీడీపీ పెద్దలు.. తమ ప్రభుత్వం ద్వారా ఆ అడ్డంకిని అధిగమించారు. రాజధాని ప్రాంతానికే వర్తించేలా అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ జీవో 41 జారీ చేయించారు. దాన్ని ఆధారంగా చేసుకొని బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సానుభూతి పరులైన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లోని దళితుల వద్దకు వెళ్లి భూములు తమకు అమ్మాలని లేకపోతే ప్రభుత్వమే లాక్కుంటుందని బెదిరించి విక్రయ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పటికప్పుడే డబ్బు కట్టలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా ఉంది. తాను 50 ఎకరాల అసైన్డ్ భూములు కొన్నట్లు బ్రహ్మానంద రెడ్డి కూడా అంగీకరించారు. ఇదే తరహాలో కారు చవక ధరలకు సుమారు 4వేల ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

బండారం బట్టబయలు

ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న భూములను ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు వీలుగా దళితులకు వెసులుబాటు కల్పించేందుకే తమ ప్రభుత్వం జీవో 41 అమల్లోకి తెచ్చిందని పలువురు టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. దళితులపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఆ జీవో ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్క రాజధాని ప్రాంతానికి ఆ జీవోను పరిమితం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులు అసైన్డ్ భూములు కొనుగోలు చేశాకే.. ప్రభుత్వం పరిహారం ప్యాకేజీ ప్రకటించడం వంటి పరిణామాలు చూస్తే దళితుల నుంచి ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములను లాక్కొని.. తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఎక్కువ పరిహారం కొట్టేయాలన్న కుట్ర తాజా పరిణామాలతో బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారాల్లో గుంటూరు జిల్లాలో పని చేసిన అప్పటి ఐఏఎస్ అధికారులు కాంతిలాల్ దండే, కోన శశిధర్.. మంత్రులు నారాయణ, పుల్లారావుల కనుసన్నల్లో పనిచేసి వ్యవహారాలను చక్కబెట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు గుంటూరు కలెక్టరేట్లోనే తిష్ట వేసి కుట్రలను అమలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో వాటి ఆధారంగా ఉచ్చు బిగించేందుకు సీఐడీ అధికారులు విచారణ జోరు పెంచారు.

Also Read : మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు