iDreamPost
iDreamPost
కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్యపోరు చాలా కాలంగా ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు, విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2019 వరకూ దేవినేని ఉమా మంత్రిగా ఉండడంతో జిల్లాలో దాదాపుగా ఆయన హవా యే నడిచింది. పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి దేవినేని వైపు మొగ్గు చూపడంతో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం అయ్యాయి. జిల్లా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, సీనియర్ నేత నాగుల్ మీరా వంటి వారు కేశినేనిపై బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేశారు. బుద్ధా వెంకన్న ఏకంగా విజయవాడ ఎంపీ అభ్యర్థి తానే అని ప్రకటించుకున్నారు. అంతటితో ఆగక కేశినేనిపై బుద్ధా అనేక సవాళ్ళు కూడా విసిరారు.
విజయవాడ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కేశినేని తన కుమార్తె శ్వేతను బరిలోకి దింపి పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. కేశినేని శ్వేత అభ్యర్థిత్వానికి పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినా బుద్ధా వెంకన్న తదితరులు బహిరంగంగానే వ్యతిరేకించారు. చివరికి శ్వేతను ఓడించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ గాలిలో టీడీపీ కొట్టుకుపోయింది. వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఈ వివాదాలతో చిరాకు చెందిన కేశినేని నాని పార్టీకి దూరం జరిగారు. పైగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని కొండపల్లి, జగ్గయ్యపేట నగర పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో కేశినేని నాని విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ విజయాన్ని ఓ రకంగా తన భుజస్కందాలపై వేసుకున్నారు. జగ్గయ్యపేటలో మొత్తం 31 వార్డులకు గాను టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించింది. మూడు స్థానాలు ఆధిక్యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ 17 వార్డుల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది. ఒక దశలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా తలపడ్డాయి. కాగా కొండపల్లిలో మొత్తం 29 వార్డులకు గాను టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాలు గెలుచుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి గెలవడంతో టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ విజయం కూడా కేశినేని నాని వ్యూహంలో భాగమే అని చెప్పక తప్పదు.
దేవినేని ఉమా పోటీ చేసి ఓడిపోయిన మైలవరం నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొండపల్లి నగర పంచాయితీలో చక్రం తిప్పిన కేశినేని నాని టీడీపీ అధికారంలోకి రావడానికి, అంతకు మించి పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి కారణమయ్యారు. ఈ పదిరోజుల పాటు జగ్గయ్యపేట, కొండపల్లిలో విస్తృతంగా ప్రచారం చేసిన కేశినేని చివరికి జగ్గయ్యపేటలో గట్టి పోటీ ఇచ్చినా కొండపల్లి మాత్రం సొంతం చేసుకోగలిగారు. ఈ విజయం టీడీపీకి కొంత ఉపశమనం కలిగిస్తే దేవినేని ఉమా అధిపత్యానికి చెక్ పెట్టినట్టయింది. జగ్గయ్యపేట, కొండపల్లి ఫలితాలు కేవలం కేశినేని నాని కృషి వల్లనే సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు. ఇంతటి విజయంలో దేవినేని ఉమా పాత్ర లేకపోవడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిపోయినట్టే అనుకోవాల్సి వస్తుందేమో! ఇకపై జిల్లా రాజకీయాల్లో కేశినేని ఆధిపత్యం చెల్లుతుందేమో చూడాలి. అలాగే ఇప్పటికైనా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా రాజకీయాల్లో కేశినేనికి ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిందే.
Also Read : Kondapalli Municipality – కొండపల్లి కుర్చీ ఎవరికీ, కీలకంగా మారిన ఎక్స్ ఆఫీషియో ఓట్లు