iDreamPost
android-app
ios-app

కేరళ సీఎం వర్సెస్ గవర్నర్ – కొత్త వివాదం మొదలైందా?

కేరళ సీఎం వర్సెస్ గవర్నర్ – కొత్త వివాదం మొదలైందా?

ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని భావించిన కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అనుమతి నిరాకరివ్వడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రత్యేక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ భావించి ప్రత్యేక అసెంబ్లీ సమాశం నిర్వహించడానికి గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అనుమతిని కోరారు. ఎందుకు సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నారో తెలపాలని గవర్నర్ కోరడంతో ముఖ్యమంత్రి కార్యాలయం కారణాన్ని వివరించింది. అయతే ఈ సమావేశానికి అనుమతి నిరాకరిస్తూ కేరళ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ షాక్ ఇచ్చారు.

కేరళ గవర్నర్ నిర్ణయంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి అనుమతించకూడదనే నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.శాసనసభ సమావేశాన్ని నిర్వహించాలని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం చేసిన సిఫార్సును తిరస్కరించడానికి గవర్నర్‌కు ఏమాత్రం అధికారం లేదన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయంగా ముఖ్యమంత్రి కార్యాలయం అభివర్ణించింది.

ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా స్పందిస్తూ “ప్రత్యేక సమావేశానికి గవర్నర్ అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని వెల్లడించారు. శాసనసభ్యులంతా కలిసి సభ్యుల లాంజ్ వద్ద సమావేశమై వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాలని రమేష్ చెన్నితాలా తెలిపారు. కాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించిడంతో కేరళలో రాజకీయ వివాదం రాజుకునేల కనిపిస్తుంది. గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో కేరళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.