iDreamPost
android-app
ios-app

మిస్ ఇండియా వచ్చేస్తోంది

  • Published Aug 24, 2020 | 5:54 AM Updated Updated Aug 24, 2020 | 5:54 AM
మిస్ ఇండియా వచ్చేస్తోంది

చూస్తుంటే ఓటిటి రిలీజుల విషయంలో అందరికంటే కీర్తి సురేష్ ముందుండేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా వచ్చినవాటిలో కాస్త స్టార్ ఫ్యాక్టర్ ఉన్న సినిమా పెంగ్విన్ ఒక్కటే. రివ్యూలు, టాకుల సంగతి పక్కనబెడితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రేక్షకులు ఇంట్లోనే దీన్ని చూశారన్న మాట వాస్తవం. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ లక్ సఖి కూడా ఇదే తరహాలో రావొచ్చని ఇప్పటికే గట్టి టాక్ ఉంది. ఇది ఎప్పుడు తేలుతుందో కానీ తాజాగా మిస్ ఇండియా కూడా లైన్లోకి వచ్చేసినట్టు సమాచారం. నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కాబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే సుమారు 11 కోట్లకు డీల్ కుదిరిందని డేట్ ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత ప్రమోషన్లు చేసేలా ప్లానింగ్ జరుగుతోందట

. మిస్ ఇండియా కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టే. దీంతో నరేంద్రనాధ్ దర్శకుడిగా పరిచయమవుతుండగా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, నవీన్ చంద్ర లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో చాలానే ఉన్నారు. మరో ప్రధానమైన ఆకర్షణ తమన్ సంగీతం. దీని తాలూకు రీ రికార్డింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయట. ఆ మధ్య దీని గురించే తమన్ ఓ ట్వీట్ కూడా పెట్టాడు. షూటింగులకు నిబంధనలతో కూడిన పూర్తి స్థాయి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసినప్పటికీ థియేటర్ల విషయం ఇంకా ఎటూ తేల్చలేదు. ఒకవేళ తెరిచినా సగం సీట్లతో హాళ్లు నింపి వసూళ్లు తెచ్చుకోవడం జరిగే పని కాదు కాబట్టి చాలా నిర్మాతలు ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ నాని, సూర్య లాంటి అగ్ర హీరోలే ఆ బాట పట్టినప్పుడు ఇక మేమెంత అనుకుంటున్నా వాళ్ళు లేకపోలేదు .

కాకపోతే ఎవరూ తొందరపడి ప్రకటనలు చేయడం లేదు. ఆగస్ట్ ని మినహాయిస్తే వచ్చే నెల నుంచి సౌత్ లోనూ స్ట్రీమింగ్ సినిమాల తాకిడి అధికంగా ఉండబోతోంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి సంస్థలు థియేట్రికల్ బిజినెస్ ని మించి ఆఫర్ చేస్తుండటంతో ప్రొడ్యూసర్లతో ఇంత కన్నా మంచి మార్గం కనిపించడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు ఈ పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ ఎవరు మాత్రం ఏం చేయగలరు అనేలా ఉంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించడం కూడా కష్టమే. మిస్ ఇండియా తాలూకు అధికారిక ప్రకటన తదితర వివరాలు త్వరలో రాబోతున్నాయి.