సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. నటీనటులు, టెక్నిషియన్లను ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనలైజ్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో కీర్తి పోషించబోయే పాత్ర గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటిస్తుందట. ‘సర్కారు వారి పాట’ సినిమా కథ భారతదేశంలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారుతున్న బ్యాంక్ స్కాముల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. అందుకే బ్యాంక్ ఉద్యోగిగా హీరోయిన్ పాత్ర కథలో భాగంగా ఉంటుందని, కొన్ని కీలకమైన మలుపులకు కారణం అవుతుందని అంటున్నారు.
మహేష్- కీర్తి సురేష్ మొదటిసారిగా జోడీగా నటిస్తుండడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.