iDreamPost
android-app
ios-app

తూర్పు నుంచి పశ్చిమానికి మళ్లిన కేసీఆర్, లక్ష్యం నెరవేరేనా

  • Published Feb 20, 2022 | 8:34 AM Updated Updated Mar 09, 2022 | 1:25 PM
తూర్పు నుంచి పశ్చిమానికి మళ్లిన కేసీఆర్, లక్ష్యం నెరవేరేనా

తెలుగు రాజకీయాల్లో నేతల్లో కేసీఆర్ ది భిన్నమైన శైలి. మొదటి నుంచి ఆయన రాజకీయంగా అనూహ్య ఎత్తులు వేస్తూ ఉంటారు. ప్రత్యర్థులను ఏమార్చి ఫలితం సాధిస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ తన వ్యూహం మాత్రం మారదు. గతంలో విపక్షంలో ఉండగా పదే పదే ఉప ఎన్నికలతో ఆయన రాజకీయంగా ఎదుగుదలకు ప్రయత్నించేవారు. ఓసారి వైఎస్సార్ సీఎంగా ఉండగా అలాంటి ఉప ఎన్నికల ఎత్తుగడ ఫలించకపోవడంతో టీఆర్ఎస్ 15 నుంచి 8 సీట్లకు పడిపోయిన సందర్భం కూడా ఉంది. కానీ ఆయన ప్రయోగాలు మాత్రం ఆపలేదు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణాలో రాజకీయ లక్ష్యాలకు జాతీయ రాజకీయాలను ముడిపెట్టి ఫలితం సాధిస్తూ ఉంటారు.

2019 ఎన్నికలకు ముందు ఆయన అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. సాధారణ ఎన్నికల కారణంగా జాతీయ రాజకీయాల ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారు. అధికారం నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల నాటికి మోదీ కి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రకటనలు గుప్పించారు. తూర్పుతీరం వెంబడి పర్యటనలు చేశారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తో పాటుగా అప్పట్లో విపక్షంలో ఉన్న డీఎంకే స్టాలిన్ తోనూ మంతనాలు జరిపి వచ్చారు. వాటి ఫలితం కేసీఆర్ కి దక్కిందనే చెప్పాలి. జాతీయస్థాయి రాజకీయాలతో ముడిపడిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం డబుల్ డిజిట్ సీట్లు సాధించి కారు జోరు ప్రదర్శించారు.

ఇక ఇప్పుడు మరోసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. మోదీకి వ్యతిరేకంగా మరోసారి గళం విప్పారు. బీజేపీని సాగనంపాల్సిందేనంటూ శపథం చేస్తున్నారు. ఆ క్రమంలో మోదీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతున్నారు. అంతటితో సరిపెట్టకుండా ఈసారి పశ్చిమతీరం నుంచి ప్రయత్నాలు మొదలెట్టారు. ముంబై వెళ్లి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. మోదీ వ్యతిరేక కూటమికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో కేసీఆర్ కి జాతీయస్థాయి నేతల్లో గుర్తింపు ఉంది. కానీ కేవలం 17 ఎంపీ సీట్లున్న రాష్ట్రం నుంచి ఆయన ప్రాంతీయ పార్టీల కూటటమికి నాయకత్వం వహించే లక్ష్యం నెరవేరుతుందా అంటే సందేహమే. అయినప్పటికీ కేసీఆర్ హస్తినకు తాడేసి లాగుతున్న తరుణంలో హైదరాబాద్ అయినా తనకు మిగులుతుందనే అంచనాలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడం ద్వారా మోదీ వ్యతిరేకులను సంతృప్తిపరిచి తెలంగాణాలో తనకు సానుకూలత ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నారు. కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలంగా మాట్లాడుతూ ఆ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకి రంగం రెడీ చేస్తున్నారు. తద్వారా తెలంగాణాలో టీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. అదే సమయంలో భారీ ఆశలతోనే ఆయన ఢిల్లీ వైపు చూపు సారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో దేవేగౌడ తరహాలో రాజకీయ అవకాశం వస్తుందనే అంచనాలున్నప్పటికీ వర్తమానంలో అలాంటివి అరుదుగానే చెప్పాలి. ఏమయినా ఢిల్లీ వ్యవహారాల్లో జోక్యం ద్వారా తెలంగాణాలో పట్టు నిలబడుతుందనే ఉద్దేశం కేసీఆర్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమవుతుందో చూడాలి.