Idream media
Idream media
నిజాలు నిలకడమీద తెలుస్తాయంటారు. ఈ నానుడి మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో నిజమని నిరూపితమవుతోంది. టీఆర్‌ఎస్ పార్టీలో ఆది నుంచి ఉన్న ఈటల రాజేందర్‌ను… భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటలకు చెందిన జమున హేచరీస్ సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని, అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిందనే ఆరోపణలపై కేసీఆర్ ఈ చర్యలు చేపట్టారు. ఓ భూ యజమాని రాసిన లేఖ ఆధారంగా కేసీఆర్ మంత్రి ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆయనపై కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామం తర్వాత.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. హుజురాబాద్ ప్రజల ముందు నిలుచున్నారు. ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకున్నా.. నియోజకవర్గంలో పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్న ఈటల రాజేందర్‌పై… నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి నెలకొంది. ఆయనకు మద్ధతు పెరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు.. ఈటలకు ప్రజల్లో మరింత బలం పెరిగేలా ఉన్నాయి. ఈటలపై సానుభూతిని తగ్గించేందుకు.. మంత్రి కేటీఆర్, బర్తరఫ్‌కు ముందు జరిగిన అంశాలను బయటపెట్టారు.
అనామకుడు ఫిర్యాదు చేస్తే ఈటలపై చర్యలు తీసుకోలేదని చెప్పారు మంత్రి కేటీఆర్. టీఆర్‌ఎస్‌లో ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడితే సరిపోయేదని, కానీ సింపతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని చెప్పారు. వ్యక్తిగతంగా ఈటలను పార్టీలో కొనసాగేలా చేసేందుకు తాను ప్రయత్నించానని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోనే ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించేందుకు కావాలనే భూ కబ్జా ఆరోపణలు చేయించారని, వాటిని చూపుతూ ఆయన్ను బర్తరఫ్ చేశారని తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది. ఈ పరిణామాలు ఈటలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
Also Read : రేవంత్ పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పొగడ్తల వర్షం.. సొంత గూటికి చేరడం ఖాయమేనా..?