iDreamPost
android-app
ios-app

కేసీఆర్ ఆదేశాలు : ఒక్క రోజులోనే ఆ రికార్డులు స్వాధీనం

కేసీఆర్ ఆదేశాలు : ఒక్క రోజులోనే ఆ రికార్డులు స్వాధీనం

ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ‌కు సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పాలనలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది.

అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌ సర్కార్‌ వీఆర్‌వో వ్యవస్థ రద్దుకు యోచిస్తున్నట్టుగా సోమ‌వారం తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌ట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమ‌వారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని కూడా ఉత్తర్వులు జారీ చేయ‌డంతో ఉన్న‌తాధికారులు వ‌డివ‌డిగా అడుగులు వేశారు. సోమ‌వారం సాయంత్రానికే వీఆర్ఓ ల వ‌ద్ద త‌హ‌సీల్దార్లు రికార్డులు స్వాధీనం చేసుకుని కలెక్ట‌ర్ల‌కు అంద‌జేశారు.

రెవె”న్యూ” చ‌ట్టంపై 10న చ‌ర్చ‌

తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీఅయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) స‌మావేశ‌ంలో సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చచేపట్టనున్నారు. అలాగే భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపక్ష సభ్యులను కోరారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలుకుతున్నాయి. కాగా, కొత్త రెవెన్యూ చ‍ట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

నేటి నుంచి రిజిస్ట్రేష‌న్లు బంద్

అలాగే తెలంగాణ ప్రభుత్వం మ‌రో సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ శాఖ వెబ్ సైట్ నుంచి చ‌లాన్ ఆప్ష‌న్ ను తొల‌గించారు. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్‌ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్‌ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలకు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ నేటికి వాయిదా పడింది.