iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఆఫర్

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఆఫర్

ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న డిమాండ్ తో 30 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మరో ఆఫర్ ఇచ్చారు. 5వ తేదీ మంగళవారం రాత్రి 12 గంటల లోపు విధుల్లో చేరాలని సూచించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత శనివారం రాత్రి అయన మీడియా తో మాట్లాడారు. 

‘రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న 49 వేల మంది కార్మికుల పొట్టకొట్టి నష్ట పరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, సోదరుడిగా చెప్తున్నా.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది. యూనియన్ల మాయలో పడకుండా కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం చేజార్చుకోవద్దు. మీకు రక్షణ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

చేరకపోతే ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుంది.. 

అవకాశం ఇవ్వకపోతే తమ తప్పు అని, ఇచ్చినా వినియోగించుకోకపోతే వాళ్ల తప్పు అని వ్యాఖ్యానించారు. కార్మికులు తమ కుటుంబాలు, జీవితాలను రోడ్డున వేయొద్దని.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్‌ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు. నవంబర్‌ ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని స్పష్టంచేశారు. 

67 శాతం జీతాలు పెంచాం.. 

‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలకు చెందిన చిరుద్యోగులను ఆదుకున్న చరిత్ర మాది. ఆర్టీసీ కార్మికులకు కూడా నాలుగేళ్లలో 15శాతం ఫిట్‌మెంట్‌తో కలుపుకుని 67శాతం వేతనాలు పెంచాం. ప్రతీ ఒక్కరు గౌరవప్రదంగా బతకాలి. ఎవరి కడుపూ కొట్టకూడదు అనే ఉద్దేశంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఐకేపీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వీఏఓలు తదితరుల జీతాలు పెంచాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపడం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం’ అని కేసీఆర్‌ తెలిపారు.