వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు అనుమతులు ఇచ్చింది. కొత్తగా లే అవుట్ వేసే స్థలాలకు మాత్రం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి పట్టాలెక్కనుంది.
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ముందుకు తెచ్చింది. 26 ఆగస్టు 2020లోపు లే అవుట్ చేసిన భూములకు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ జీవో 131ని విడుదల చేసింది ప్రభుత్వం. 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి 200 రూపాయలు, 101 నుంచి 300 గజాల ఫ్లాట్‌కు గజానికి 400 రూపాయలు, 301 నుంచి 500 గజాల ప్లాటుకు గజానికి 600 రూపాయలు, 501 నుంచి 750 గజాల స్థలానికి గజానికి 750 రూపాయలు చెల్లించేలా స్లాబ్స్ నిర్ణయించింది. అక్టోబర్ 15లోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ తో దాదాపు 10 వేల కోట్ల ఆధాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
కానీ ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ పట్ల ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి కూడా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. దీంతో ప్రభుత్వం జీవో 131ని పున: సమీక్షిస్తూ సవరణలు చేసింది. ఎల్‌ఆర్ఎస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేసిన సవరణలతో మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట లభించినప్పటికీ మార్కెట్ ధరల కారణంగా 2013 తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మెజార్టీ మధ్యతరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ పట్ల సుముఖత చూపలేదు.
జీవో విడుదలైన నాటి నుంచీ ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేత భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ప్రభుత్వానికి రావల్సిన ఆధాయం కూడా నిలిచిపోయింది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ ఎల్ఆర్ఎస్ ను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఎల్ఆర్ఎస్ రద్దును చేర్చింది. అటు కాంగ్రెస్ కూడా ఆధాయాన్ని సమకూర్చుకునేందుకే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ముందుకు తెచ్చిందనే విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొద్ది నెలలుగా ఎల్ఎర్ఎస్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తాజానిర్ణయంతో ముగింపు పలికింది ప్రభుత్వం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కొనసాగించనున్న ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ద్వారా పాత పద్ధతిలోనే వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేయనుంది.