iDreamPost
android-app
ios-app

సీఎం వైఖరి మారిందా..?

సీఎం వైఖరి మారిందా..?

ప్రత్యేకమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమకారుడుగా ఉన్న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ పితగా పేరు గాంచారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా పాలన సాగిస్తామని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ఉద్యమ సమయంలో వార్డుకు, వీధికి జేఏసీలు ఏర్పాటు చేసి.. అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన కేసీఆర్‌.. పాలనలోనూ అందరినీ కలుపుకుని పోతారని ఆశించిన వారికి ఆశాభంగమే అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఏడేళ్ల కాలంలో ఏనాడు ప్రతిపక్ష పార్టీల నేతలను కేసీఆర్‌ కలవలేదు. తాజాగా జరిగిన మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటన సందర్భంగా తొలిసారి తనను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలకు కేసీఆర్‌ అపాయింట్మెంట్‌ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది.

సాధారణంగా.. ప్రతిపక్ష పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసే రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్‌ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వాధినేతలను ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు కలిశారంటే.. రాజకీయంగా సంచలనమే. అలా కలవడం నేరమైనట్లుగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తాయి. ముఖ్యమంత్రి కూడా వారిని కలిసేందుకు ఆసక్తి చూపరు. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి.. ఇలా పలు అంశాలపై పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులను కలిసే సంస్కృతి ఇప్పడు లేదు. కానీ తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు.. ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. అయితే వారికి ప్రగతిభవన్‌ నుంచి అపాయింట్మెంట్‌ లభించలేదు.

తాజాగా మరియమ్మ లాకప్‌ డెత్‌ ఘటన విషయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు తనను కలిసేందుకు వస్తారనగానే.. కేసీఆర్‌ నుంచి అపాయింట్మెంట్‌ లభించింది. దళిత మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించారో.. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను నిలువరించేందుకు ఆపాయింట్మెంట్‌ ఇచ్చారో.. గానీ కేసీఆర్‌లో వచ్చిన మార్పు మాత్రం ప్రత్యేకమైనది. పైగా వారి డిమాండ్లను సావధానంగా విని.. అమలు పరిచారు. కేసీఆర్‌.. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ సాగుతున్న విమర్శలు.. ఇలాంటి భేటీల వల్ల కొంత మేర అయినా తగ్గే అవకాశం ఉంది. మరి ఈ పంథాను కేసీఆర్‌ కొనసాగిస్తారా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : తెలంగాణ బీజేపీలో ఈట‌ల చేరిక అనంత‌రం…