హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. అన్ని పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. హుజురాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకుందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఉప ఎన్నికలను తన అపర చాణక్య నీతి తో డీల్ చేసే కేసీఆర్ ఒక్కొక్క అస్త్రాన్ని హుజురాబాద్ లో వదులుతున్నారు. ఇప్పటికే వలసల స్పీడ్ పెంచిన కేసీఆర్. మరో దళితనేతను హుజురాబాద్ కేంద్రంగా తెరమీదకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే దళితబంధును హుజురాబాద్ కేంద్రంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి చైర్మన్ గా మోత్కుపల్లి నర్సింహులను ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా దళితబంధుకు చట్టబద్దత కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
మోత్కుపల్లిని దళిత బందు చైర్మన్ గా ప్రకటించడంతో విపక్షాలకు చెక్ పెట్టినట్లు టిఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలకు మేలు చేసేందుకు తీసుకువచ్చిన దళితబంధు పథకంను హుజురాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. ఇందుకోసం 500 కోట్లు కూడా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న 40వేలకు పైగా దళితుల ఓట్లను ఈ పథకం ద్వారా తమవైపు తిప్పుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ హయాంలో పలుమార్లుఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా మోత్కుపల్లి అనేక పదవులు చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీకి అంటీముట్టనట్లు ఉన్న మోత్కుపల్లి గవర్నర్ పదవి ఆశించి భంగపడ్డారు. తరువాత టీడీపీ నుండి బీజేపీలో చేరిన మోత్కుపల్లి అంతే స్పీడ్ గా రాజీనామా చేశారు. గతకొంత కాలంగా కేసీఆర్ ను పొగుడుతున్న మోత్కుపల్లికి దళితబంధు చైర్మన్ పదవి ఇచ్చారు. మరోవైపు హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నాయకుడు,విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించి ఉపఎన్నికల హీట్ కేసీఆర్ పెంచారు. ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను హరీష్ రావు డైరెక్షన్లో మంత్రులు ఎర్రబెల్లి, గంగుల కమలాకర్ భుజాన మోస్తున్నారు.
ఇప్పటికే దళితుల ఓట్ల కోసమే దళితబంధు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు, దళితసంఘాల నుండి పెద్ద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మోత్కుపల్లి టిఆర్ఎస్ లో చేరక ముందే పదవి ఇవ్వడం కూడా విమర్శలకు తావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం టిఆర్ఎస్ అధికారాన్ని తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తుందని ఓట్లకోసమే దళితులను మోసం చేస్తున్నారన్న విపక్షాల విమర్శలకు మోత్కుపల్లి రూపంలో చెక్ పెడతారా లేక మళ్ళీ విమర్శల పాలవుతారా చూడాలి.
Also Read : ఎల్.రమణ సంగతి ఏంటి..?