iDreamPost
iDreamPost
అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ అధ్యక్షుడి హోదాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. రికార్డ్ స్థాయిలో సాగిన ఈ 3648 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురంలో ముగిసింది. యాత్ర విజయానికి సూచికగా అక్కడ భారీ విజయం స్థూపం ఆవిష్కరించారు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే.
కానీ అంత అద్భుతమైన స్థూపం ఏర్పాటు వెనుక ఉన్నది ఎవరో తెలుసా?.. దాని నిర్మాత కాయల వెంకట రెడ్డి. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఈయన వైఎస్ కుటుంబానికి వీరాభిమాని. ఆ అభిమానంతోనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విజయ స్థూపం నిర్మాణ బాధ్యతలను స్వీకరించారు. అప్పటికీ ఇప్పటికీ పదవులు ఆశించకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్న వెంకటరెడ్డి నిబద్ధతను స్వయంగా జగనే గుర్తించారు. కోరకుండానే కీలకమైన ఏపీ మెరిటైమ్ బోర్డు చైర్మన్ గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. తనను నమ్ముకున్న వారిని, పార్టీకి విధేయులుగా ఉన్నవారిని జగన్ మర్చిపోరన్నదానికి ఈయన నియామకం ఒక ఉదాహరణ.
స్వయంకృషితో రాణింపు
కాయల వెంకటరెడ్డిది తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి మండలం మహేంద్రవాడ స్వగ్రామం. ఎంఏ చదువుకున్న ఆయన ఉద్యోగాల వైపు వెళ్లకుండా స్వయం ఉపాధి కల్పించుకొని తనతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. విశాఖను తన కార్యక్షేత్రంగా మలచుకోవాలని నిర్ణయించుకొని కొన్నేళ్ల క్రితం నగరానికి తరలివెళ్లి స్థిరపడ్డారు. భూముల క్రయవిక్రయాల వ్యాపారం మొదలుపెట్టి.. క్రమంగా దాన్ని వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించారు. కేవీఆర్ ఎస్టేట్స్ పేరుతో విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో ఎన్నో వెంచర్లను విజయవంతంగా నిర్వహించారు. అదే సమయంలో ప్రజాసేవ సంకల్పం పూని.. తన సంపాదనలో కొంత ప్రజాసేవకు వినియోగిస్తున్నారు. ఎంతోమందిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు వంటివి అందజేసి ఆదుకున్నారు.
Also Read : రాజన్న దళం చిరంజీవి రెడ్డికి ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఎలా దక్కింది..?
వైఎస్ కుటుంబ అభిమాని
వెంకటరెడ్డి మొదటి నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ అభిమాని. ఆ అభిమానంతో అనపర్తిలో ఉన్నప్పుడు కాంగ్రెసుకు పరోక్షంగా అండదండలు అందించేవారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు సహకరించేవారు. వైఎస్ తదనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడిగా మారారు. తన వ్యాపారాలు చేసుకుంటూనే.. పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ చేరుకున్నప్పటి నుంచి ఇచ్ఛాపురంలో ముగిసే వరకు ఆ యాత్ర నిర్వాహణలో కీలకపాత్ర పోషించారు.
యాత్ర దిగ్విజయానికి సూచికగా.. చిరకాలం గుర్తుండిపోయేలా విజయ చిహ్నం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు.. వెంకటరెడ్డి వెంటనే ముందుకొచ్చి ఆ బాధ్యత తనకు వదిలిపెట్టాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. మొత్తం నిర్మాణ బాధ్యతను చేపట్టి..సొంత ఆర్థిక వనరులతో ఈఫిల్ టవర్ ను పోలిన స్థూపాన్ని నిర్మించారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరించి.. తన పరిధిలో అత్యధికంగా కార్పొరేటర్లు గెలిచేందుకు కృషి చేశారు. పార్టీకి వెంకటరెడ్డి చేస్తున్న సేవలను నాయకత్వం గుర్తించింది. ఆయన కోరకుండానే ఇటీవలి నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఏపీ మెరిటైం బోర్డు అధ్యక్షుడిగా కీలక పదవి అప్పగించింది.
Also Read : స్వాతి రాణికి జీసీసీ.. బుల్లిబాబుకు ట్రైకార్